అర్వింద్ వ‌ర్సెస్ సంజ‌య్‌.. క‌మ‌లంలో క‌ల్లోలం!!

మ‌రో ఆరేడు మాసాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో మూడు నాలుగు మాసాల్లోనే అన్నీ కుదిరితే షెడ్యూల్ కూడా ప్ర‌క‌టించేస్తారు. ఇంత కీల‌క స‌మ‌యంలో క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల్సిన తెలంగాణ బీజేపీ నాయ‌కులు.. ఆక‌స్మిక కుమ్ములాట‌ల‌కు తెర‌దీయ‌డం అంద‌రినీ నివ్వెర పోయేలా చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తాం.. క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని జైల్లోకి నెడ‌తాం.. అన్న నాయ‌కులు..తమ‌లో తామే కుమ్మేసుకుంటున్నారు.

దీంతో అస‌లు తెలంగాణ బీజేపీ క‌ట్టుత‌ప్పిందా.. చుక్కానిలేని నావ‌లా మార‌నుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదే.. కేంద్ర బీజేపీ పెద్ద‌లే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎందుకు వీరు ఇంత కుమ్ములాట‌ల‌కు దిగార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా కూడామారింది. పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ‌డం ప‌ట్ల పార్టీ సీనియ‌ర్లు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ పాద‌యాత్ర ద్వారా పార్టీలో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇది అదికార కేంద్రీక‌ర‌ణ‌కు దారితీస్తుంద‌ని..కొంద‌రు నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను టార్గెట్ చేసుకునేందుకు కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నేది వాస్త‌వం. ఇక తాజాగా మహిళా దినోత్సవం రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన ‘ముద్దు’ రాజ‌కీయంగా కాక రేపాయి.

దీనిని బీఆర్ ఎస్ నేత‌ల‌కు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే.. ఇలాంటివాటి విష‌యంలో సొంత పార్టీనేత‌ను వెనుకేసుకురావాల్సిన బీజేపీ నేత‌లు.. సంజ‌య్‌ను సందిగ్ధంలో ప‌డేశారు. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కో-ఆర్డినేట్‌ చేయడానికేనని.. పవర్ సెంటర్ కాదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వాస్త‌వానికి బండి సంజయ్, అర్వింద్‌ మధ్య గతంలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేవు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో చేరికల విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాల్కొండకు చెందిన ఒక నేత పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నా.. అర్వింద్‌ అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి రావాలనుకునే ఇతర పార్టీల నేతలు బండి సంజయ్‌తో టచ్‌లో ఉండటం అర్వింద్‌కి నచ్చడం లేదని.. అందుకే అసంతృప్తి వెళ్లగక్కినట్లు చర్చ నడుస్తోంది.

ఇదిలావుంటే.. మ‌రోవైపు బండి సంజయ్‌, సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇవి అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకుని చ‌ర్చించారు. ఇలాంటి తరుణంలో ఎంపీ అర్వింద్‌, పేరాల శేఖర్‌రావు వంటి సీనియ‌ర్లు కూడా సంజ‌య్‌పై అసంతృప్తి వెళ్లగక్కడం బీజేపీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇలా అయితే.. బీఆర్ ఎస్‌ను చేజేతులా గెలిపించిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.