కవితను కాపీ కొడుతున్న షర్మిల

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండాలని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అనుకుంటున్నారు. నిత్యం ఎవరోకరి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో కొనసాగేందుకు వైస్సార్ బిడ్డ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలోని అన్ని పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరు మహిళామణుల మధ్య నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తోంది.

లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను కమ్ముకువస్తున్నాయి. కవిత జైలుకెళ్తారా వెళ్లరా అనేది ఈ నెల 16న తేలుతుంది. అయితే ముందు ఆమెకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత ఒక రోజు దీక్ష చేశారు. ఆ కార్యక్రమానికి జాతీయ మీడియా కవరేజ్ బాగానే వచ్చింది. కొన్ని పార్టీల నేతలు కూడా దీక్షకు హాజరయ్యారు. మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు..

కట్ చేసి చూస్తే వైఎస్ షర్మిల కూడా ఇప్పుడు చలో ఢిల్లీ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నానని కవిత చెప్పుకుంటున్నారు. 14న ఢిల్లీలో ఆమె ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. కవిత దీక్ష చేసిన జంతర్ మంతర్ నుంచే షర్మిల ర్యాలీ ప్రారంభమవుతుంది. పార్లమెంట్ హౌస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీలందరికీ కాళేశ్వరం గురించి తెలిసేనా చేయాలని షర్మిల నిర్ణయించారు. అవినీతి చేసేందుకే వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రారంభించారన్నది షర్మిల ప్రధాన ఆరోపణ. ప్రాణహిత – చేవెళ్ల కంటే కాళేశ్వరం చిన్నదట.

ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు షర్మిలను విమర్శిస్తున్నాయి. కవిత ఢిల్లీలో దీక్ష చేసిన తర్వాతే షర్మిలకు దేశ రాజధాని గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నాయి. పబ్లిసిటీ కోసం షర్మిల ఆరాటపడుతున్నారని, ఆమెను తెలంగాణలోనే ఎవరూ పట్టించుకోరని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు తెలంగాణలో ఏమీ సాధించలేని షర్మిల ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు…