జగన్ వ్యూహం అదుర్స్… ఎవరూ నోరెత్తడానికి లేదంతే

YS JAgan

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన వ్యూహంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏదైనా విషయంపై తాను ఓ క్లారిటీకి వచ్చేస్తే… ఇక ప్రత్యర్థులు గానీ, సామాన్య జనం గానీ… ఆ అంశంపై పెద్దగా మాట్లాడటానికి ఏమీ ఉండదని, అంతో ఇంతో మాట్లాడినా జగన్ పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవన్న వాదనలు ఇప్పుడు స్పష్టం అయిపోయాయి.

విషయం ఎంత కీలకమైనదైనా.. తనదైన మార్కు వ్యూహాంతో పథకం రచించే జగన్… ఇక ఆ అంశంపై ఇతరులు ప్రశ్నించడానికి, తనను నిలదీయడానికీ ఎలాంటి అవకాశం లేకుండా చేసుకుంటూ పోతున్నారని కూడా చెప్పక తప్పదు. ఈ తరహా వ్యూహాన్ని తాను సీఎం కాకముందు నుంచే అమలు చేస్తూ వస్తున్న జగన్… ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై బుర్ర బద్దలు కొట్టుకునే పని లేకుండా జగన్… తన విలువైన సమయాన్ని ఆదా చేసుకుంటున్నారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అదెలా గంటే… కాపులకు రిజర్వేషన్లు మొన్నటి ఎన్నికలకు ముందు కాక రేపిన కీలక అంశం. అయితే తన పాదయాత్రలో కాపులకు కంచుకోటగా ఉన్న జగ్గంపేటలో… కాపులకు రిజర్వేషన్ల విషయంలో తానేమీ చేసేది లేదని, ఈ అంశం కేంద్రం పరిధిలోనిదంటూ సంచలన ప్రకటన చేసిన జగన్.. కాపులకు రిజర్వేషన్లపై ఇక తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా చేసుకున్నారు. వెరసి జగన్ సీఎం కాగానే ఈ విషయంపై ఆయనను ఏ ఒక్కరూ పెద్దగా ప్రశ్నించేందుకు అవకాశమే లేకుండా పోయిందని చెప్పాలి.

అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనా జగన్ తనదైన శైలి ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో మాట్లాడుతూనే ఉంటామని, అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్రంపై ఒత్తిడి చేసే అవకాశం లేదని, వచ్చే ఎన్నికల దాకా ఇదే పరిస్థితి ఉంటుందని నిక్కచ్చిగా చెప్పిన జగన్… హోదాపైనా ఇతరులేమీ మాట్లాడకుండా చేశారనే చెప్పాలి.

ఇక ఇప్పుడు కీలక సమస్యగా మారిన కరోనా విస్తృతిపైనా జగన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం చేయక తప్పదంటూ ఆదిలోనే సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్… ఇప్పుడేమో కరోనా అందరికీ వస్తుందని, రాష్ట్రంలో ఎన్ని కేసులు పెరిగినా చేసేదేం లేదని ప్రకటించేసి.. కరోనాపై విమర్శలకు చెక్ పెట్టేశారని చెప్పక తప్పదు.

అంటే… ఏ విషయంపై అయినా తనదైన శైలి వ్యూహాన్ని రచించుకుంటూ సాగుతున్న జగన్… ఆయా అంశాలపై విపక్షాలకు గానీ, జనానికి గానీ అస్సలు ప్రశ్నించడానికే అవకాశం లేకుండా చేస్తున్నారన్న మాట. ఈ తరహా శైలి వ్యూహంతో రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా భావిస్తున్న అంశాలు, వాటిపై విరుచుకుపడే విమర్శలకు కౌంటర్లు ఇచ్చేందుకు వెచ్చించాల్సిన సమయాన్ని జగన్ చాలా తెలివిగా ఆదా చేసుకుంటున్నారన్న మాట.