క‌వితను అరెస్టు చేస్తే చేయ‌నీయండి.. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌!!

త‌న కుమార్తె, ఎమ్మెల్సీ క‌వితకు ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి మ‌ధ్య లింకు ఉంద‌నే విష‌యం గ‌త మూడు మాసాలుగా నాను తున్న‌ప్ప‌టికీ.. ఎన్న‌డూ నోరు విప్ప‌ని సీఎం కేసీఆర్.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారని అన్నారు.

‘కవితను మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’ అంతేకదా..?” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఎవరికీ భయపడేది లేదని.. పోరాటం అస్సలు ఆపే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. మంత్రి, కవిత సోద‌రుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో క‌విత అరెస్టు త‌ప్ప‌ద‌నే సంకేతాలకు బ‌లం చేకూరిన‌ట్టు అయింది. ఇక‌, కవిత శనివారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠం నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలో కవితతో పాటు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. ఇక‌, బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు వెళ్లారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ పెద్దలంతా ఢిల్లీకి పయనం అవుతుండ‌డం మ‌రింత ఉత్కంఠ‌కు దారితీసింది.