దెబ్బ‌కు ఠా!.. బాబు వ్యూహంతో ఆ ‘న‌లుగురి’కి ఉక్కిరిబిక్కిరే!!

దెబ్బ‌కు ఠా.. దొంగ‌ల ముఠా!! అన్న‌ట్టుగా.. చంద్ర‌బాబు వేసిన తాజా ఎత్తుతో.. టీడీపీకి చెందిన న‌లుగురు రెబ‌ల్ ఎమ్మెల్యేలు.. బిక్క‌చ‌చ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌తో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరిపోయారు. జ‌గ‌న్‌కు అనుకూలంగా అజెండా భుజాన వేసుకున్నారు.

మ‌రికొంద‌రు.. ఏకంగా చంద్ర‌బాబు కుటుంబంపైనే విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరిలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల స‌భ్యుడు కరణం బలరాం, గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాల గిరి, విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. ఈ న‌లుగురు వైసీపీలో చేరినా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. అంతేకాదు.. వీరు.. అసెంబ్లీ లెక్క‌ల ప్రకారం.. ఫైనాన్స్ స్టేట్‌మెంట్స్ ప్ర‌కారం.. టీడీపీ స‌భ్యులుగానే వేత‌నాలు పొందుతున్నారు.

అయినప్ప‌టికీ.. చంద్ర‌బాబు వీరిపై ఎలాంటి చ‌ర్య‌లూ ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకోలేదు. కాని.. ఇప్పుడు బాబుకు కూడా ఛాన్స్ ద‌క్కింది. ఈ నెల 23న జ‌రిగే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యించారు. ఇదే జ‌రిగితే.. టీడీపీ అభ్య‌ర్థి గెలిచేందుకు 23 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌రం. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 23 మందినే గెలుచుకుంది.

సో.. ఇప్పుడు వారంతా టీడీపీ అభ్య‌ర్థికి అనుకూలంగా ఓటేస్తే.. మండ‌లిలో టీడీపీ తర‌ఫున ఒక అభ్య‌ర్థి అడుగు పెట్ట‌డంఖాయం. కానీ, ఆ న‌లుగురు పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఎన్నికల్లో పోటీకి దిగితే తెలుగుదేశం అందరికీ విప్ జారీ చేయాల‌ని భావిస్తోంది. ఫ‌లితంగా రెబ‌ల్ ఎమ్మెల్యేలు కూడా విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

ఒకవేళ ఓటు వేయకుండా విప్‌ను ఉల్లంఘిస్తే.. ఆయా ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మ‌రోవైపు వైసీపీలో అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించిన‌.. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటివారు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం బరిలోకి దిగితే ఎన్నిక రసవత్తరం కానుంది.