కవితది బలప్రదర్శనేనా ?

మహిళా రిజర్వేషన్ పేరుతో శుక్రవారం ఢిల్లీలో కల్వకుంట్ల కవిత బలప్రదర్శనకు దిగుతున్నారా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అవుననే అంటున్నారు అందరు. ఇంతకీ విషయం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించి చట్టం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ దశాబ్దాలుగా వినబడుతునే ఉంది. అధికారంలో ఎవరున్నా మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టించుకోవటంలేదు. మళ్ళీ ప్రతిపక్షంలోకి మారగానే అందరికీ మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొస్తుంది.

అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది రాజకీయ పార్టీలకు ఒక ఆటలాగ తయారైపోయిందని అర్ధమవుతోంది. అలాంటి బిల్లుపై ఇపుడు హఠాత్తుగా కవిత డిమాండ్ మొదలుపెట్టింది. మళ్ళీ తెలంగాణా అసెంబ్లీలో మహిళలకు పెద్దపీట వేయాలన్న డిమాండును తండ్రి, కేసీయార్ దగ్గర మాత్రం వినిపించటంలేదు. అందుకనే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతు రిజర్వేషన్లపై కవితది అంతా ఉత్త నాటకాలుగా కొట్టిపారేసింది.

సరే ఎవరి టార్టెట్లు ఎలాగున్నా 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు కవిత హాజరుకాబోతోంది. ఈ నేపధ్యంలోనే 10వ తేదీన జంతర్ మంతర్లో జరగబోతున్న దీక్షలో 16 పార్టీలు మద్దతు పలికాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, శివసేన, ఆర్జేడీ, సమాజ్ వాదీపార్టీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, ఆప్, ఆర్ ఎల్డీ తదితర పార్టీల నేతలు ముఖ్యంగా ఎంపీలు హాజరవుతుండటం గమనార్హం. ఈడీ విచారణ ముందు ఇన్ని పార్టీల ఎంపీలు, ముఖ్యనేతల మద్దతుతో కవిత ఒక్కరోజు దీక్షకు కూర్చోవటం కాకతాళీయం కాదనే అనిపిస్తోంది.

విచారణ పేరుతో తనను వేధించినా, అరెస్టుచేసినా తాను ఒంటరిని కానని, తనకు మద్దతుగా ఇన్ని పార్టీలు ఉన్నాయని చెప్పటమే కవిత ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఎందుకంటే ఆర్జేడీ, సమాజ్ వాదీపార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్, మృతిచెందిన ములాయంసింగ్ యాదవ్ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు నానా రచ్చచేశారు. బిల్లు కాపీలను చించి పోగులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీల ఎంపీలు కూడా ఇపుడు మహిళా రాజర్వేషన్ దీక్షలో పాల్గొంటుండటమే విచిత్రంగా ఉంది.