ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయంటూ.. ఆయ‌న `ఇండిగో` విమాన స‌ర్వీసుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సంప‌ద కూడా ఒక‌రిద్ద‌రి చేతుల్లోనే ఉంటే ఇలానే జ‌రుగుతుంద‌న్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ట్రేడ్ యూనియ‌న్ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇండిగో అంశాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. పైల‌ట్ల‌కు రెస్టు ఇవ్వాల‌ని.. పేర్కొంటూ.. డీజీసీఏ ఏడాది కింద‌టే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని తెలిపారు. అయినా.. కొంద‌రి చేతుల్లోనే ఉన్న విమానరంగం ఈ ఉత్త‌ర్వుల‌ను పెడ‌చెవిన పెట్టింద‌ని, అందుకే ఇప్పుడు.. ఇబ్బందులు త‌లెత్తాయ‌నిఅన్నారు. పెత్త‌నం .. పెట్టుబ‌డి ఒకే చేతిలో ఉంటే జ‌రిగే అన‌ర్థాల‌కు ఇండిగో ఘ‌ట‌నను ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న పేర్కొన్నారు.

దేశంలో మెజారిటీ విమానాల‌న్నీ.. ఇండిగో, టాటాల చేతుల్లోనే ఉన్నాయ‌ని.. అందుకే అవి రూల్స్ పాటించ‌డం లేద‌ని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు చేతులు కాలిపోయాక‌.. ఆ ఇబ్బందులు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. ఇక‌, అధికారం కూడా ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మాదిరిగానే ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. ఇండిగో విమానాల ర‌ద్దు, ఆల‌స్యంతో కేంద్రం స్పందించి.. ఇటీవ‌ల త‌ను ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను వెన‌క్కి తీసుకుంది.

ఈ ప‌రిణామాల‌ను ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. ఒక‌రిద్ద‌రి చేతుల్లోనే అధికారం, పెట్టుబ‌డి, సంస్థ‌లు ఉంటే ఇలానే జ‌రుగుతుంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. డీజీసీఏ నిర్దేశించిన ప్ర‌మాణాల‌ను పాటించాల్సిందేన‌ని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. ఇండిగో వ్య‌వ‌హారంపై కేంద్రం స్పందించింది. ప్ర‌త్యామ్నాయంగా రైళ్ల‌ను ఏర్పాటు చేశామ‌ని.. ప్ర‌యాణికులు వినియోగించుకోవాల‌ని పేర్కొంది. స‌మ‌స్య స‌ర్దుబాటు అయ్యే వ‌ర‌కు.. రైళ్ల‌ను కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలిపింది.