అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. తాజాగా శ‌నివారం ఆయ‌న పార్టీకోసం స‌మ‌యం కేటాయించారు. గ‌త రెండు రోజుల కింద‌టే ఈవిష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం పూర్తిగా పార్టీకోస‌మే స‌మ‌యం కేటాయించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఆయ‌న మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు.. పార్టీ నాయకుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఈ నెల 1న పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎంత‌మంది పాల్గొన్నారు?  ఎంత‌మంది ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు? ఎంత సేపు  ఉన్నారు?  అనే విష‌యాల‌ను ఆరా తీశారు. గ‌త నెల‌లోనే 60 శాతం మంది హాజ‌ర‌య్యార‌ని.. ఈ నెల‌లో 100 శాతం మంది హాజ‌రు కావాల‌ని ఆదేశించిన విష‌యాన్ని గుర్తు చేశారు. అయితే.. 90 శాతం మంది నాయ‌కులు పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్రమంలో పాల్గొన్న‌ట్టు పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావు తెలిపారు. అయితే.. దీనిపై త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. అదేవిధంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితుల‌ను కూడా అడిగితెలుసుకున్నారు.

టైంపాస్ నేత‌లు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. కొంద‌రు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నార‌ని.. క‌నీసం పార్టీ కార్యాల‌యాల‌కు కూడా రావ‌డం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది స‌రైన విధానం కాద‌న్నారు. పార్టీ చేప‌ట్టిన ప్ర‌తికార్య‌క్ర‌మం లోనూపాల్గొనాల్సిందేన‌ని.. అదేవిధంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని తేల్చి చెప్పారు. సంక్రాంతి త‌ర్వాత నుంచి తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్న‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలో నాయ‌కులు, ఎమ్మెల్యేలు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు చేసిన మంచిని వివ‌రించాల‌ని తెలిపారు.

అదేవిధంగా కూట‌మి నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త చాలా అవ‌స‌రమ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. దీనిపై అంద‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం మ‌ళ్లీ మ‌ళ్లీరావాల‌ని.. కూట‌మిలో ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నార‌ని తెలిపారు. ఈ విష‌యంలో పార్టీ నాయ‌కులు కూడా అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. క‌ల‌సి ఉంటేనే రాష్ట్రానికి మంచి జ‌రుగుతుంద‌ని.. ప్ర‌జ‌ల‌కు ఈ విష‌యాన్ని మ‌రింత అర్థ‌మ‌య్యేలా వివ‌రించాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు గైర్హాజ‌రు కావ‌డంపైనా చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.