నల్లారికే పీలేరు టికెట్

టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. యాత్రకు వచ్చిన జనాన్ని చూసి లోకేష్‌కు పట్టరాని ఆనందం కలుగుతోంది. యాత్ర 500 కిలోమీటర్ల మైలురాయి దగ్గర పడుతోంది. యాత్రలో భాగంగా రైతు, కర్షక, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలను లోకేష్ పలుకరిస్తున్నారు. వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలం, ఏం చేస్తామో కూడా లోకేష్ చెప్పేస్తున్నారు.

అభ్యర్థుల ప్రకటన

యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను లోకేష్ ప్రకటిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు పోటీగా గాలి భానుప్రకాష్‌కు రంగంలోకి దించుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. 2019లో పలమనేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మళ్లీ అక్కడ పోటీ చేస్తారని లోకేష్ తేల్చేశారు. అమర్ నాథ్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ వెంట నీడలా తిరుగుతూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సత్యవేడులో డాక్టర్ హెలెన్ ను అభ్యర్థిగా ప్రకటించారు. హెలెన్ కొత్త అభ్యర్థి కావడం గమనార్హం.

ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రగిరి నుంచి పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారుజనసేనతో పొత్తు కుదిరితే తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లి స్థానాలను ఆ పార్టీకి వదిలేసే అవకాశం ఉంది.అందుకే అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు.

కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం

పీలేరు పాదయాత్రలో భాగంగా అక్కడ బహిరంగ సభ జరిగింది. వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని అందరూ సహకరించి ఆయన్ను గెలిపించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడే కిషోర్ కుమార్. వారి తండ్రి అమర్ నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు.

15వ సారి పోటీ

నల్లారి కుటుంబం ఎన్నికల్లో 15వ సారి పోటీ చేస్తోంది. కిషోర్ స్వయంగా మూడో సారి బరిలోకి దిగుతున్నారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి ఆరు సార్లు పోటీ చేశారు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఐదు సార్లు పోటీ చేశారు. ఒక సారి మాత్రమే ఓడిపోయారు. వారి తల్లి ఒకసారి ఎన్నికల బరిలో దిగారు.