రాజకీయ కూటమిలో ఎవరు ఎటు వైపు ఉంటారు. ఎవరు ఎవరికి మిత్రులు, ఎవరు ఎవరికి శత్రువులు, శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడి ఎవరికి వర్తిస్తుంది. ఇలాంటి చర్చ అప్పుడప్పుడూ తెరపైకి వస్తూ కొన్ని రోజుల తర్వాత తెరమరుగవుతుంటుంది. ఈ సారి మళ్లీ అదే చర్చ మొదలైంది…
స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చెన్నై తరలివచ్చారు. స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ లేని కూటమి వద్దు…
స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆయన ప్రధాని అయ్యే అవకశాలున్నాయని ఫరూక్ అబ్దుల్లా సభలో అన్నారు. ఆ ప్రతిపాదనను స్టాలిన్ తిరస్కరించారు. 2024 లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా కీలకమైనవని స్టాలిన్ గుర్తు చేశారు. విభజనవాదులను ఓడించకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలన్నదాని కంటే ఏ పార్టీ అధికారంలోకి రాకూడదో గ్రహించి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అప్పుడే బీజేపీని ఓడించగలమని అంటూ కాంగ్రెస్ లేని కూటమి ఊహకందడం లేదన్నారు. ఎన్నికల తర్వాత లెక్కలు చూసుకుని కూటమి కట్టే కంటే ఎన్నికల ముందే పొత్తులు పెట్టుకుంటే మంచిదని స్టాలిన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు…
తెలుగు నేతలకు ఆహ్వానమేదీ…
స్టాలిన్ జన్మదిన వేడుకలకు దేశంలోని పలు పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. పిలిచిన వాళ్లంతా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. వారిని దూరంగా ఉంచడమే మంచిదన్న అభిప్రాయం వెల్లడైనట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నారని తమిళనాడులో ఒక టాక్ నడుస్తోంది. దానితో ఆయన్ను వద్దనుకుని ఉండొచ్చు. బీఆర్ఎస్ ను స్థాపించిన తర్వాత కేసీఆర్ తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులోని కొన్ని వర్గాలను పిలిచి మాట్లాడుతున్నారు. అందుకే ఆయనతో మనకు ఎందుకులే అని డీఎంకే వర్గాలు దూరం పెట్టాయని అంటున్నారు. పైగా కేసీఆర్, బీజేపీ వ్యతిరేకి అంటే నమ్మకం కుదరడం లేదని డీఎంకే నేతలు అంటున్నారు.. అదన్నమాట సంగతి…
Gulte Telugu Telugu Political and Movie News Updates