కొన్నిసార్లు అంతే.. ఏళ్లకు ఏళ్ల క్రితం హాట్ హాట్ గా జరిగిన చర్చల్ని గుర్తు చేసే అంశాలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో అలాంటి పరిస్థితే నెలకొంది. అంతకంతకూ పెరిగిపోతూ.. ఒక్క చెన్నైమహానగరంలోనే లక్షకు కాస్త దగ్గరగా పాజిటివ్ లు పెరిగిపోయిన వేళ.. రాష్ట్ర రాజధాని నగరాన్ని మార్చాలన్న పాత డిమాండ్ సరికొత్తగా తెర మీదకు వచ్చింది. దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం తమిళనాడు రాజధానిని మార్చాలన్న ప్రతిపాదనపై జోరుగా చర్చ సాగింది.
అప్పట్లో ఈ అంశాన్ని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత మహానేత ఎంజీఆర్ ప్రయత్నించారు. కానీ.. ఫలించలేదు. తర్వాతి కాలంలో ఈ ప్రతిపాదనకు కాస్త మార్పులు చేసిన డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత నేత కరుణానిధి సైతం విమర్శల్ని ఎదుర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధానిని చెన్నై నగరం కాకుండా మరో నగరాన్ని చేయటాన్ని అస్సలు ఇష్టపడని పరిస్థితి.
తాజాగా కరోనా వీరతాండవం చేస్తున్న వేళ.. పాత డిమాండ్ సరికొత్తగా తెర మీదకు వచ్చింది. చెన్నై మహానగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే ఈ స్థాయిలో కరోనా వచ్చినట్లుగా అభిప్రాయపడుతున్నారు. అదే.. చిన్న ప్రాంతం రాజధానిగా ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.
అప్పట్లో ప్రతిపాదించిన తిరుచ్చి నగరాన్ని తమిళనాడు రాజధానిగా చేసి ఉంటే.. ఈ రోజున 90 వేల మంది పాజిటివ్ గా అయ్యే వారు కాదని చెబుతున్నారు. మరి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెర మీదకు వచ్చిన కొత్త రాజధాని మాట ఎంతవరకు వెళుతుందన్నది ఇప్పటికిప్పుడు అంచనా వేయటం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అనుకుంటున్నట్లుగా తిరుచ్చిని తమిళనాడు రాజధానిగా మారిస్తే..కొత్త సమస్యల్ని ఎదుర్కొనే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.