మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి మాత్రం గంటా చేరిక ఖాయమని, సీఎం జగన్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జోరుగా వదంతులు వినిపిస్తున్నాయి. గంటా చేరికకు జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని, గంటా వైసీపీ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అని వైసీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.
2019 ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి టీడీపీకి గంటా దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరేందుకు గంటా ప్రయత్నించారు. కానీ, గంటా రాకను వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లు వ్యతిరేకించారు. దీంతో, సైలెంట్ గా ఉన్న గంటా….త్వరలో జరగనున్న స్థానిక సంస్థల నేపథ్యంలో వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.
ఇందుకోసం మంత్రులు కన్నబాబు, బొత్స రాయబారం నడిపారట. గంటా చేరితే…విజయసాయి సైడ్ అవుతారని, దీంతో, తన స్థానం పదిలం అవుతుందని బొత్స అనుకుంటున్నారట. ఇక, గంటా చేరిక ఖాయమైతే…మంత్రి అవంతి ఇరకాటంలో పడతారని, ఒకవేళ భవిష్యత్తులో భీమిలి టికెట్ గంటాకు ఖాయమైతే…అవంతికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
అయితే, విజయసాయిరెడ్డి మాటను కాదని గంటాను వైసీపీలో చేర్చుకుంటే….విజయసాయిరెడ్డి హవా తగ్గినట్లే అన్న టాక్ వస్తోంది. ఇప్పటికే , జగన్ , విజయసాయిల మధ్య గ్యాప్ వచ్చిందన్న వాదనలకు (ఒకవేళ గంటా వైసీపీలో చేరితే) గంటా వ్యవహారం బలం చేకూరుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో విజయసాయి నెంబర్ 2గా చలామణి అయ్యారు. అయితే, కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు జగన్ కు విజయసాయి దూరమవుతున్నారన్న భావనను కలిగిస్తున్నాయి. అందులోనూ వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా ఉన్న విజయసాయిని సంప్రదించకుండా…గంటాను చేర్చుకోవాలన్న చర్చ జరిగిందంటే…ఆ వాదనలకు బలం చేకూరుతోంది.
గతంలో గంటా అవినీతిపరుడని, అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరతారని విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటాను వైసీపీలో చేర్చుకునేది లేదని, గంటాకు వైసీపీ ఎపుడో డోర్స్ క్లోజ్ చేసింది అని అన్నారు. గంటా హవా విశాఖలో ఇపుడు లేదని, ఆయన పలుకుబడి పూర్తిగా పోయిందని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వద్దు, చేర్చుకోం అన్న గంటాను జగన్ చేర్చుకుంటే విజయసాయికి ప్రాధాన్యత తగ్గినట్లే కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. గంటా వంటి సీనియర్ నేతను చేర్చుకుంటే…విజయసాయిరెడ్డికి ప్రత్యామ్నాయ శక్తిని ఆహ్వానించినట్టే కదా అన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు, విజయసాయిరెడ్డికి ఉన్న స్థానం అలాగే ఉందని, కానీ ఆయన చెప్పిందంతా గుడ్డిగా వినాల్సిన అవసరం లేదన్న భావనలో జగన్ ఉన్నారని టాక్ వస్తోంది. ఏది ఏమైనా…గంటా ఒకవేళ వైసీపీలో చేరితే వైసీపీలో అంతర్గత ముసలానికి బీజం పడ్డట్లేనని అనుకుంటున్నారు.