జగన్ కాపాడినా కష్టమే.. వదిలేసినా కష్టమే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పెద్ద తలనొప్పినే ఎదుర్కొంటున్నారు. ఆయన సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి హత్య కేసులో పీకల్లోతు చిక్కుకుపోయినట్లే కనిపిస్తున్నారు. వివేకా హత్యకు ప్రణాళిక రచించింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలే అని సీబీఐ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. అవినాష్, భాస్కర్‌లే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు అనే కోణంలోనే సీబీఐ విచారణ చేస్తోందని.. ఈ దిశగా కీలక సాక్ష్యాధారాలు సేకరించిందని ఈ అఫిడవిట్‌ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. మధ్యలో ఈ కేసు విషయంలో సీబీఐ జోరు తగ్గించినట్లు, నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి కానీ.. ఇటీవల మొత్తం కథ మారిపోతోంది. ఈ కేసు జగన్ చేయి దాటిపోతోందని, అవినాష్ జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ కేసు విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియని అయోమయంలో జగన్ పడినట్లు కనిపిస్తోంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుంది పరిస్థితి. ఇప్పుడు అవినాష్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్‌ అతణ్ని కాపాడే ప్రయత్నం చేసినా కష్టమే.. అలా అని వదిలేసినా కష్టమే. కేసు ఇంత దాకా వచ్చాక అవినాష్‌ను కాపాడ్డం అంత తేలిక కాదు. అందుకోసం జగన్ చాలా రాజీ పడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున రాయబారం నడపాలి. సీబీఐ ఇంత బలంగా అఫిడవిట్ ఇచ్చాక, అవినాషే ప్రధాన నిందితుడు అనే అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్లాక.. కేసును తారుమారు చేస్తే జగన్‌కు చెడ్డ పేరు వస్తుంది. వ్యవస్థల మీద జనాలకు పూర్తిగా నమ్మకం పోతుంది. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడనే ఆరోపణల్ని జగన్ ఇప్పటికే ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు అవినాష్ కేసు కూడా అలాగే అయితే ఎన్నికల ముందు జగన్ మరింత అప్రతిష్ట పాలు కావడం ఖాయం. అలా అని అవినాష్‌ను కాపాడకుండా వదిలేస్తే.. అది కుటుంబానికే చెడ్డ పేరు తెస్తుంది. గత ఎన్నికలకు ముందు వివేకా హత్య చేయించింది చంద్రబాబే అని ప్రచారం చేశారు. సాక్షి మీడియాలో చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అది ఎన్నికల్లో కూడా జగన్ పార్టీకి ఉపయోగపడింది. అప్పుడు అంత రచ్చ చేసి చివరికి అవినాష్ నిందితుడిగా తేలితే జగన్ పరువు పోతుంది. పైగా తననే నమ్ముకున్న తమ్ముడిని కాపాడుకుండా వదిలేశాడు, రేప్పొద్దున తమకైనా ఇంతే అనే అభిప్రాయం పార్టీ నేతలకు రావచ్చు. ఇది పార్టీలో ఇబ్బందికర పరిస్థితికి దారి తీయొచ్చు. ఇలా ఏ రకంగా చూసినా జగన్‌కు తలపోటు తప్పేలా లేదు.