తెలుగు మీడియాలో సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఒక అగ్ర పత్రిక ఈ రోజున సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. ఓపక్క తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణిస్తున్న రోజువారీ మరణాల్ని పదికి మించకుండా చూపించటం తెలిసిందే.
అప్పుడప్పడు తప్పించి.. మిగిలిన రోజుల్లో మాత్రం పది కంటే తక్కువగా చూపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవానికి ఏ మాత్రం సిద్ధం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అలా అని ఆ విషయాన్ని ఇప్పటివరకూ నిరూపించింది లేదు.
ఇలాంటివేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఓ ప్రయోగాన్ని చేసింది. హైదరాబాద్ లోని ఈఎస్ఐ శ్మశాన వాటిక వద్ద గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత వరకూ తన సిబ్బందితో డేగకన్ను వేయించి.. లెక్కలు తీశారు.
కరోనా డెడ్ బాడీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని శ్మశానానికి తీసుకొస్తారో అదే రీతిలో వచ్చిన అంబులెన్స్ ల లెక్కను తీశారు. ఇలా తీస్తే.. ఒక్క ఈఎస్ఐ శ్మశాన వాటికకు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చిన అంబులెన్సులు ఏకంగా 38 కావటం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగరంలో కొన్ని శ్మశాన వాటికల్లో కరోనా కారణంగా మరణించిన డెడ్ బాడీలకు నిర్వహించిన అంతిమసంస్కారాల లెక్క తీస్తే.. అవి మరో పన్నెండుగా తేలాయి. సదరు సంస్థ వేసిన లెక్క ఇలా ఉంటే.. వాస్తవ లెక్క మరెలా ఉంటుందన్నది ఒక సందేహం.
తెలంగాణ రాష్ట్రం మొత్తం వదిలేసి.. ఒక్క హైదరాబాద్ లోనే ఇలా ఉంటే.. మిగిలిన రాష్ట్రమంతా లెక్క వేస్తే ఇంకెన్ని మరణాలు? అన్న సూటి ప్రశ్నను సదరు కథనం సంధించింది.
ఇప్పటివరకు నామమాత్రంగానే కరోనా మరణాలు సాగుతున్నాయన్న తెలంగాణ సర్కారు వాదనను తిప్పి కొట్టేలా.. ఆత్మరక్షణలో పడేసేలా తాజా కథనం ఉందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో కరోనా మరణాల అంత్యక్రియలపై తెలంగాణ ప్రభుత్వం ఏమని బదులిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates