టీడీపీని ఏదో చేయాల‌నుకుని.. వంశీనే ఇరుక్కుపోయారా?

మ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న వివాదం.. అనంత‌రం టీడీపీ నేత‌ల అరెస్టులు వంటి ఘ‌ట‌న‌ల‌తో స్థానిక ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఇమేజ్ డ్యామేజీ అయిందా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి.. వైసీపీ వ‌ర్గాలు. వైసీపీలోనే వంశీ అంటే గిట్టని వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. వ‌ర్గం తాజాగా జ‌రిగిన గ‌న్న‌వ‌రం ఎపిసోడ్ ద్వారా వంశీ ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం ప్రారంభించిన‌ట్టు చెబుతున్నారు.

నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వంశీ వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు టీడీపీనే లేద‌ని ప్ర‌చారం చేసేందుకు వంశీ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ఏదొ ఒక వంక పెట్టుకుని టీడీపీ కార్యాల‌యంపై దాడులు చేశార‌ని.. యార్ల‌గ‌డ్డ వ‌ర్గం ఆరోపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు కేవ‌లం సోషల్ మీడియాకు ప‌రిమితం అయ్యాయి.

వంశీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న యార్ల‌గ‌డ్డ‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం పార్టీలో నేరుగా త‌న‌కు టికెట్ అడిగితే ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో అవ‌కాశం కోసం.. ఆయ‌న ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అందివ‌చ్చిన అవ‌కాశాన్నిఆయ‌న స‌ద్విని యోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వైసీపీలోనే గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం అక్క‌డ ఏం జ‌రిగింద‌న్న విష‌యాల‌ను మీడియాకు అందుతున్న క్ర‌మాన్ని ప‌రిశీలిస్తే.. యార్ల‌గడ్డ వ‌ర్గం వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వంశీ ఇమేజ్ డ్యామేజీ అయిపోయింద‌ని.. ప్ర‌శాంతంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ అనుచ‌రులు చిచ్చు పెడుతున్నార‌ని.. గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల్లోనూ ఇది స‌హించే ప‌రిస్థితి లేద‌ని వీరు అంటుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి టీడీపీని ఏదో చేయాల‌ని అనుకున్న‌ప్పటికీ.. ఇప్పుడు వంశీకి వైసీపీలోనే సెగ పుడుతుండ‌డం గ‌మ‌నార్హం.