ఇద్దరూ అధిష్టానానికి దగ్గరే.. టికెట్ ఎవరికో మరి?

తెలంగాణలోని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి మళ్లీ టికెట్ ఆశిస్తుండగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ ప్రజల్లో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని, తామే బరిలో ఉంటామని చెప్తుండడంతో కార్యకర్తలు, ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు.

అటు పద్మ దేవేందర్ రెడ్డి, ఇటు సుభాష్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గర మనుషులే కావడంతో ఇద్దరిలో ఎవరు టికెట్ తెచ్చుకుంటారనే విషయంలో కార్యకర్తలు కూడా ఏమీ అంచనా వేయలేకపోతున్నారు. కాగా ఇద్దరు నేతలూ ఎవరికివారు వర్గాలను పోషిస్తుండడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభిమానులు కూడా గందరగోళానికి గురవుతున్నారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు మెదక్ కంచుకోటలాంటి నియోజకవర్గం. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అనేది నేతల లెక్క. ఈ క్రమంలోనే సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ మరోసారి ఇక్కడి నుంచి టికెట్ కోరుకుంటుండగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై కన్నేశారు.

పద్మ దేవేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు. విజయశాంతి, బట్టి జగపతి వంటి హేమాహేమీలను ఓడించారు. మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్‌ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలాకాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెప్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్‌లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని చెప్తున్నారు.