ఏపీ ఎస్ ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియామకం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టేతో పాటుగా హైకోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిసన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నిమ్మగడ్డ వ్యవహారంలో కావాలనే స్టే ఇవ్వకుండా నిరాకరించామన్న సుప్రీం…. గవర్నర్ లేఖ రాసిన తర్వాత కూడా నిమ్మగడ్డకు తిరిగి పోస్టింగ్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును తప్పుబడుతూ కొందరు చేసిన ట్వీట్లు సుప్రీం కోర్టు దృష్టికి వచ్చాయి. ఏపీ హైకోర్టు జడ్జిలను అవమానించేలా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు ఏపీ ఎస్ ఈసీ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వివరించారు.
ఏపీ హైకోర్టు జడ్జిలను కరోనా పేషెంట్లున్న గదిలో ఉంచాలంటూ అవమానకర రీతిలో కామెంట్స్ చేశారని సాల్వే వెల్లడించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబ్డే…వారం రోజుల్లోగా ఆ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్ లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ వ్యవహారంపై బార్ అండ్ బెంచ్ ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు హోరెత్తాయి. కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కీలక వ్యాఖ్యలను బార్ అండ్ బెంచ్ ట్వీట్ చేసింది.
నిమ్మగడ్డను నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలులో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే అన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ లేఖ పంపినా రమేశ్ కుమార్‌కు తిరిగి పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయం….ఇది కోర్టు ధిక్కరణే… అని బాబ్డే వ్యాఖ్యానించారు.
మే 29న తనను ఏపీ ఎస్ ఈసీగా నియమించాలన్న హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందంటూ జులై 17న నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం….జులై 20న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నిమ్మగడ్డ కలిశారు. దీంతో, హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి జులై 23న గవర్నర్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates