వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ తో మాట కలిపేందుకు ఇష్టపడటం లేదు. సాధ్యమైనంత వరకూ దూరం ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో వారున్నారు. ఎన్నికల నాటికి జారుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడటం మంచిదన్న అభిప్రాయంలో వారున్నారు..
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారారు. సీఎం జగన్ సమీక్ష అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు బిక్కుబిక్కుమంటూ వెళ్తుంటే.. మద్దిశెట్టి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. ఇప్పటికే ఒకసారి జగన్ బటన్ నొక్కుడు వ్యవహారంతోపాటూ.. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంపై మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ బహిరంగ సభలోనే విమర్శలు గుప్పించారు. తాజాగా.. జగన్ సమీక్షకు కూడా ఆయన డుమ్మా కొట్టడం వైసీపీలో తీవ్ర చర్చగా మారింది.
ఇంజినీరింగ్ కాలేజీల ఓనర్ గా పేరున్న వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఓడిపోయి దూరమయ్యారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ పొందారు. 30 వేల మెజార్టీతో గెలిచారు. ఎన్నికల్లో ఆయనకు సహకరించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు వేణుగోపాల్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో కేడర్ రెండుగా విడిపోయింది.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సొంత మనుషుల్ని మండలానికొక ఇన్‌ఛార్జ్‌గా నియమించడం, తమ్ముడు శ్రీధర్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం వంటి అంశాలపై గతంలో జగన్ క్లాస్ పీకినట్టు వైసీపీలో టాక్ వినిపించింది. అదే సమయంలో.. దర్శిలో తనకు వ్యతిరేకంగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఎమ్మెల్యే మద్దిశెట్టి జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ నేపథ్యంలోనే జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నారు. కార్యక్రమ నిర్వహణలో వెనుకబడ్డారని జగన్ హెచ్చరిస్తున్నా.. మద్దిశెట్టి మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
గతేడాది ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో మద్దిశెట్టి వేణుగోపాల్ హాట్ కామెంట్స్ ఇప్పటికీ పార్టీ నేతల చెవుల్లో మారుమోగిపోతున్నాయి. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లాలంటే గ్రామాల్లో నాలుగు పనులు చేయాలని, చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని లోపాలను ఎత్తి చూపారు. నవరత్నాలు పేరుతో జగన్ బటన్ నొక్కితే, గ్రాఫ్ ఆయనకే పెరుగుతుంది తప్పా ఎమ్మెల్యేలకు పెరగడం లేదని వాపోయారు. వైసీపీలోని వ్యవహారాలపైనా అసంతృప్తిగా ఉన్న మద్దిశెట్టి.. గతేడాది నవంబర్‌లో జరిగిన జగన్ సమీక్షా సమావేశానికీ హాజరు కాలేదు. తాజాగా.. నిర్వహించిన సమీక్షకు కూడా ఆయన డుమ్మా కొట్టారు. దాంతో.. మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని కొందరంటున్నారు. జనసేనలో చేరినా ఆశ్చర్యం లేదని కొందరు అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని విశ్లేషించుకుంటున్నారు…
Gulte Telugu Telugu Political and Movie News Updates