నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిండంతో పాటు నిమ్మగడ్డ నియామకంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరో వైపు హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో ఏపీ ఎస్ ఈసీగా నిమ్మగడ్డ నియామకం దాదాపుగా తప్పదు. అయితే, నిమ్మగడ్డను నియమించడానికి ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా నిమ్మగడ్డకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసు రేపో మాపో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు…నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీం తాజా తీర్పు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
వాస్తవానికి ఏపీ ప్రభుత్వం అని చెప్పినా….ప్రభుత్వం తరపున కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే. దీంతో, నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సీఎస్ నీలం సాహ్ని చిక్కుల్లో పడినట్లయింది. ఇప్పటికే రాజ్‌భవన్ నుంచి నీలం సాహ్నికి నిమ్మగడ్డ నియామక ఆదేశాలు వచ్చాయి. వాస్తవానికి నిమ్మగడ్డ నియామక ఆదేశాలు సీఎస్ తయారు చేసి గవర్నర్‌కు పంపాలి. దానిపై గవర్నర్ సంతకం చేసి సీఎస్ కు తిరిగి పంపుతారు. అయితే, నిమ్మగడ్డ వ్యవహారంలో అటువంటి పరిస్థితి లేకపోవడంతో డైరెక్ట్ గా సీఎస్ కు గవర్నర్ సంతకం పెట్టి మరీ ఆదేశాలు పంపారు. దీంతో, ఆ ఆదేశాలపై సీఎస్ స్పందించకుంటే టెక్నికల్ గా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లవుతుంది. దీంతో, రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు పంపారు నీలం సాహ్ని.
ఆ వ్యవహారం ఎటూ తేలకుండానే హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం స్టే పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా…నిమ్మగడ్డ నియామకం వ్యవహారంలో గవర్నర్ సలహా ఇవ్వాలా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంటే, ఈ వ్యాఖ్యలు సీఎస్ ను పరోక్షంగా ఉద్దేశించి చేసినవిగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కేసులో సీఎస్ నీలం సాహ్ని హైకోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. మరి, నిమ్మగడ్డ నియామకంపై సుప్రీం ఆదేశాలు, కోర్టు ధిక్కరణ వ్యవహారం, సీఎస్ హాజరుపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates