అదేంటి అనుకున్నారా? కొన్నాళ్ల కిందట ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ..”ఇదేం ఖర్మమన రాష్ట్రానికి” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. కొన్నాళ్ల తర్వాత.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో ఇదేం ఖర్మ కార్యక్రమం వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు మరోసారి.. చంద్రబాబు ఈ కార్యక్రమానికి రెడీ అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. అదే ఇధంగా బహిరంగ సభల్లో పాల్గొంటారు.
తొలిరోజు జగ్గంపేట, రెండవ రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడవ రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మూడు రోజులు.. 145 కి.మీ పొడవున రోడ్‌షో, పర్యటన సాగనుంది. జగ్గంపేటలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పూర్తి చేశారు. ఇక గోకవరంలో పర్యటన ఏర్పాట్లను నెహ్రూ, వంతల రాజేశ్వరి తదితరులు పూర్తి చేశారు.
జగన్‌పై ఇరువైపుల దాడి
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చాలా వ్యూహాత్మక పోరును చేస్తోంది. ఒకవైపు యువగళం పాదయాత్ర ద్వారా.. పోరును పెంచి సీమ ప్రాంతంలో నారా లోకేష్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతున్నారు. ఇక, ఇటువైపు చంద్రబాబు తూర్పు నుంచి నరుక్కొస్తున్నారనే చెప్పాలి. అంటే.. టీడీపీ చాలా వ్యూహాత్మకంగా ఇరు వైపుల నుంచి సర్కారుపై దాడిని ముమ్మరం చేసిందని అంటున్నారు.