మోడీ ఎఫెక్ట్: బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు

ఇది ఒక ఊహించ‌ని ఘ‌ట‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌ను ఎదిరించిన రాజ‌కీయ నేత‌లు.. లేదా.. తాము దారిలో కి తెచ్చుకోవాల‌ని భావించిన వారిపైనే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వాటిని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యోగిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షాలు ఇటీవ‌ల పార్ల‌మెంటు వేదికగా కూడా మోడీపై దుమ్మెత్తి పోశాయి. రాజ్యాంగ బ‌ద్థ సంస్థ‌ల‌ను ఇలా త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకుంటున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పించాయి.

స‌రే.. అది రాజ‌కీయం!! బీజేపీ కూడా ఎదురు దాడి చేసింది. త‌మ‌కు ఎలాంటి పాపాలూ లేవ‌ని కూడా చెప్పుకొచ్చింది. అస‌లు ఏ సంస్థ ప‌ని ఆ సంస్థ చేస్తోంద‌ని కూడా వెల్ల‌డించింది. మోడీ అస‌లు ఏమీ ఎరుగ‌ర‌ని కూడా స‌ర్టిఫికెట్లు ఇచ్చేసింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా బీబీసీ ఛానెల్ కార్యాల‌యాల‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఛానెల్ కార్యాల‌యాల‌కు వెళ్లి అధికారులు.. ఆదాయ వివ‌రాలు.. ఉద్యోగులు.. జీత భ‌త్యాలు.. వంటివాటి రికార్డుల‌ను త‌నిఖీ చేస్తున్నారు.

దీంతో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. వెంట‌నే రియాక్ట్ అయిన‌.. ఐటీ శాఖ అధికారులు అబ్బే.. ఉత్తుత్తి త‌నిఖీలే.. కేవ‌లం తెలుసుకునేందుకు మాత్ర‌మే వ‌చ్చామ‌ని స‌మాచారం ఇచ్చాయి. కానీ, ఊర‌క‌రారు మ‌హానుభావులు క‌దా! అన్న‌ట్టుగానే ఐటీ దాడుల వెనుక వేరే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన గోద్రా ఘ‌ట‌న‌పై.. బీబీసీ రెండు భాగాలుగా ఆక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది.

త‌ప్పంతా మోడీదేన‌ని ఈ డాక్య‌మెంట‌రీల్లో తేల్చి చెప్పింది. ఇది తీవ్ర వివాదంగా మార‌డం.. కేంద్రం వెంట‌నే స‌ద‌రు డాక్య‌మెంట‌రీని బ్యాన్ చేయ‌డం.. ఇది పార్ల‌మెంటులోనూ రచ్చ‌కు దారితీయ‌డం తెలిసిందే. ఇక‌, ప్ర‌స్తుతం బీబీసీ ప్ర‌సారాల‌నే బ్యాన్ చేయాలంటూ.. సుప్రీంకోర్టులో కేసు కూడా ప‌డింది. దీనిని కోర్టు తోసిపుచ్చింద‌నుకోండి.. కానీ, తాజాగా బీబీసీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం.. మోడీ ఎఫెక్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.