సీఎం జగన్‌పై, ఆయన సలహాదారు సజ్జలపై డైరెక్టుగా విమర్శలు చేసి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నానని ప్రకటించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరుతారని సంకేతాలిచ్చారు. అయితే, టీడీపీలో పరిస్థితులు మాత్రం కోటంరెడ్డికి ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా నెల్లూరు పార్టమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నుంచి కోటంరెడ్డికి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. కోటంరెడ్డిని టీడీపీలోకి రానిచ్చేది లేదని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ పెద్దలకు ఈ విషయాన్ని ఖరాకండీగా చెప్పేసిన అజీజ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టి కోటంరెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా ఆయన కోటంరెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ బెట్టింగులు ఆడేవారున, సింగిల్ నంబర్ లాటరీలు ఆడించేవారిని టీడీపీలోకి రానిచ్చేది లేదని అజీజ్ అన్నారు. ఎవరైనా ఇంట్లో పండ్లు, పూల మొక్కలు వేస్తారు కానీ గంజాయి మొక్కలు నాటరని అన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసినవారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటామని ప్రశ్నించిన అజీజ్.. టీడీపీ అధికారంలోకి రాగానే అంతకంత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో దౌర్జన్యంగా వైసీపీలో చేర్చుకున్నారని చెప్పే జున్ను రాఘవయ్య అనే నేతను తిరిగి టీడీపీ కండువా కప్పారు అజీజ్.
వైసీపీతో కోటంరెడ్డి తెగతెంపులు చేసుకోవడంతో ఇప్పుడాయనకు ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ, టీడీపీలోకి ఆయన్ను రానివ్వడానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ నుంచి ఎన్నడూ లేనంత ప్రతిఘటన వస్తుండడంతో టీడీపీ అధిష్టానం కూడా కోటంరెడ్డి విషయంలో ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో అజీజ్ అహ్మద్‌కు బాగా పట్టుండడం… ఆయనతో పాటు మిగతా నేతలూ కోటంరెడ్డి రాకకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.