ఇదొక అనూహ్య పరిణామం. ఎవరూ ఊహించని ఘటన. ఇప్పటి వరకు కనీసం పేరు కూడా ఎత్తని నాయకుడి గురించి.. ఏకంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. ఏకంగా రాజ్యసభలోనే దివంగత వంగవీటి మోహన రంగా గురించి సుమారు 4 నిమిషాల పాటు మాట్లాడారు. ఏకధాటిగా ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉండడంతోపాటు.. అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.
ఇంతకీ.. జీవీఎల్ ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా-మచిలీపట్నం కేంద్రంగా ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా, పేద ప్రజల పెన్నిదిగా భావించే వంగవీటి మోహన రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నట్లు తెలిపారు.
అయితే, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలకు అనేక మంది పేర్లు పెట్టినప్పటికీ వంగవీటి మోహన రంగా పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రంగా అభిమానుల ఆకాంక్ష మేరకు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం వంగవీటి మోహన రంగా పేరుపెట్టేలా చర్యలు తీసుకోవాలని జీవీఎల్ కోరడం గమనార్హం.
అయితే.. అనూహ్యంగా జీవీఎల్‌కు రంగాపై అంత ప్రేమ ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. పైగా ఒకరాష్ట్రానికి సంబంధించిన విషయం.. అందునా రాష్ట్ర పరిధిలోని అంశం(జిల్లాలకు ఏయే పేర్లు పెట్టాలనేది రాష్ట్రం ఇష్టం).. అయినా… కూడా వీటిని పోయిపోయి పెద్దల సభలో ప్రస్తావించడం.. వెనుక కేవలం.. బీజేపీ కాపులను ఆకర్షించేందుకు.. లేదా.. కాపులకు మేమున్నామని చెప్పుకొనేందుకు ప్రయత్నించడమేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates