ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలు.. మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అవకాశం దక్కితే చాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్.. మోడీపై విరుచుకుపడ్డారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్.. ప్రతి విషయంలోనూ మోడీని టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. మోడీ గెలిచారు.. కానీ, ప్రజలు ఓడారు.. అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇంకా ఏమన్నారంటే..
- దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని, 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే పరిస్థితి ఉందని దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉంది.
- కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కాలేజీల విషయంలోనూ తీవ్ర అన్యాయం చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా సమాఖ్య వ్యవస్థ?
- తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లు ఏపీకి ఇచ్చారు. 7 ఏళ్లుగా అడుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎంగా ఉన్న తెలంగాణ జిల్లాలకు ఒక్క పైసా కూడా ఇవ్వమన్నారు.
- ఢిల్లీలో తాగునీరు లేదు. ప్రధాని మోడీ మాటలు కోటలు దాటుతున్నాయిజ.
- అమెరికాలో గ్రీన్‌కార్డు దొరికితే సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ పాలనలో 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇది దౌర్భాగ్యం కాదా?
- కాంగ్రెస్ సరిగా పనిచేయడం లేదని 2014లో మోడీకి ఓటేశారు. తెలంగాణ పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ప్రధానిగా మోడీ కన్నా మన్మోహన్ సింగ్ బాగా పనిచేశారు. కానీ, ఆయన ఎక్కడా ఇలా ప్రచారం చేసుకోలేదు.
- ది లాస్ట్ డికేడ్ బుక్‌ను గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన కేసీఆర్, దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు.
- దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మోడీ గెలిచారు.. బీజేపీ గెలిచింది.. కానీ దేశ ప్రజలు ఓడారు.
- అన్ని రంగాల్లో దేశం తీవ్రంగా నష్టపోయింది. దేశం దివాళా తీసినా తమదే పైచేయి అంటున్నారు.
- పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం అధ్వాన్నంగా ఉంది
- అదానీ గురించి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు.
- అదానీ రూపంలో దేశానికి మరో ఉపద్రవం వచ్చింది.