వైసీపీ ఎమ్మెల్యే, ఇటీవల రెబల్‌గా మారిన నెల్లూరు రూరల్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత.. రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నమ్మొద్దంటూ.. ఆయన సీఎం జగన్‌కు విన్నవించారు. ఆదాలను నమ్మొద్దు జగనన్నో!
అని కామెంట్ చేశారు. తాను మళ్లీ వైసీపీ నుంచి పోటీచేయడంలేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్ధిగా ఆదాల పోటీ చేస్తారని చెబుతున్నారని, కానీ, ఆయన తాళి కట్టమంటే.. దానిని ఎత్తుకుపోయే రకమని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన టీడీపీకి రాత్రికి రాత్రి ఝలక్ ఇచ్చి వైసీపీలో చేరిపోయారని అన్నారు. తర్వాత.. మళ్లీ టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు. ఆదాల ఏ పార్టీలో ఉంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.
వేల కోట్ల ఆస్తులున్న ప్రభాకర్ రెడ్డితో ఢీ కొనడానికి తాను సిద్ధమని కోటంరెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విష యంపై హోంశాఖకు ఫిర్యాదు చేశానన్న ఆయన… వైసీపీ ప్రభుత్వం కూడా విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మేయర్ సహా 11 మంది కార్పొరేటర్లు తనవెంట ఉన్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల తరువాత నియోజకవర్గంలో చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారని వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రెండుసార్లు మీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి, ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలతో సహా ఆరోపణ చేశా. కొండ ని తవ్వి ఎలుకని కూడా పట్టలేనట్టు వ్యవహారిస్తున్నారు. కేంద్ర హోం శాఖకి నేను ఫిర్యాదు చేసినట్టే, ప్రభుత్వం కూడా విచారణ కోరాలి. ఇలా ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారో అనే అనుమానాలు ప్రజల్లో తొలుగుతాయి. నా స్నేహితుడు సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్‌ను కూడా సరిగా చదవలేకపోయాడు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్రానికి లేఖ రాయాలి. కేంద్ర నిఘా సంస్థ వస్తే, ఎవరెవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో తేలిపోతుంది
అని కోటం రెడ్డి వ్యాఖ్యానించారు.