ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ అవసరం వచ్చినా కేంద్రం వైపు చూస్తుంటారు. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఒట్టిపోయి పైసా కూడా లేని టైములో ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసి వెయ్యి కోట్లు తెచ్చుకుంటారు. ఏదో విధంగా గట్టేక్కేందుకు ప్రయత్నిస్తారు. కేంద్రానికి అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కట్టబెట్టారు. ఏ కష్టమొచ్చినా ఢిల్లీ పరిగెత్తే జగన్ పై హస్తిన పెద్దలు ఈ సారి మాత్రం శీతకన్నేశారనే చెప్పాలి..
మూడు రాజధానులను ఏర్పాటుచేసే విషయంలో జగన్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని రాజ్యసభ వేదికగా కేంద్రం స్పష్టంచేసింది. 2014లో చేసిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 కింద ఏపీకి నూతన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది.
ఈ కమిటీ నివేదికను తదుపరి చర్యలకోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనితో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. అడిగి నిజం చెప్పించుకున్నట్లయ్యిందని వైసీపీ వర్గాలు విజయసాయిపై మండిపడుతున్నట్లు సమాచారం.
విభజన చట్టంలోని నియమాల ప్రకారం ఇప్పటికీ అమరావతే రాజధాని అని కూడా కేంద్రం తేల్చిచెప్పింది. 2015లో అప్పటి రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూనుకుందని పార్లమెంటులో చెప్పడం ద్వారా కేంద్రం తన మనసులోని మాట బయటపెట్టిందని టీడీపీ వర్గాలు అంటుండగా, అవసరంగా విజయసాయి కదిలించి కంపు చేశారని వైసీపీ వర్గాలు వాపోతున్నాయ్. ఇంతకాలం కేంద్రం అనుకూలంగా లేకపోయినా తటస్థంగా ఉంటుందని అనుకుంటే విజయసాయి అడిగిన ప్రశ్న ద్వారా.. జగన్ ఏకపక్ష నిర్ణయం బయటపడిందని. అది మున్ముందు తమకు ఇబ్బందిగా మారుతుందని వైసీపీ వర్గాలు భయపడుతున్నాయి. ఇకనైనా విజయసాయి సంయమనం పాటిస్తే మంచిదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates