నటులు రాజకీయాలు చేయడం కామన్. కానీ రాజకీయ నాయకులు నటులవడం అరుదు. అయితే… నటన రంగంలోకి ఎవరొచ్చినా అది మధ్యలో వచ్చి మధ్యలో పోయే కళ కాదు. ఒకసారి కళా పోషణ అనేది మనసులో పడితే దానిని పోగొట్టడం కష్టం. అందుకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా సినిమాలు చేయడానికి కారణం అదే. తాజాగా వైసీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా తాజాగా వేషం కట్టారు. గిరిజనుల ఇలవేలుపు జై. మోదకొండమ్మ గురించి తీస్తున్న సినిమాలో సద్గురువు పాత్రలో ఆయన నటిస్తున్నారు.
పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా తాజాగా షూటింగ్ మొదలైంది. విశాఖ గాజువాకలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యే ధర్మశ్రీపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన పోలాకి శివ ఈ సినిమా దర్శకుడు. ఎమ్మెల్యే ఇంటి వద్దే సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.
ధర్మశ్రీ నంది అవార్డు నటుడు. 2009లో ధర్మశ్రీ నటించిన దుర్గి సినిమాలో నటనకు ఆయనకు బంగారు నంది అవార్డు దక్కింది. ఒడిశా గిరిజన తండాలోని ఓ బాలిక యదార్థగాథపై తీసిన చిత్రం ‘దుర్గి’. దుర్గికి తండ్రిగా అప్పన్న పాత్రలో ధర్మశ్రీ కీలకపాత్ర పోషించారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్న ధర్మశ్రీకి నటనలో మంచి ప్రవేశం ఉన్నా వెండి తెరపై ఇదే తొలిసినిమా. 2004లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మాడుగుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రలో నటించారట. అతని నటనకు మెచ్చిన వైఎస్ అప్పటినుంచి అన్నమయ్య అనే పిలిచేవాడట.
హర్మోనియం, తబలా వాయించలరు. హరికథలు చెప్పగలరు. రచయితగా, కవిగా కూడా కరణం ధర్మశ్రీకి పేరుంది. మొత్తానికి ఒక ఎమ్మెల్యే అటు రాజకీయం… ఇటు నటన… రెండింటిలోను రాణించడం అద్భుతమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates