వైసీపీ ఎంపీకి టికెట్ ఉందా.. లేదా? అంతా సైలెంట్‌!!

ఆయ‌న వైసీపీ యువ ఎంపీ. త‌ర‌చుగా.. స‌మ‌స్య‌ల‌పైనా గ‌ళం వినిపిస్తున్నారు. పైగా ఎలాంటి అవినీతి, అక్రమాల మాట కూడా ఆయ‌నకు కిట్ట‌దు. ఆయ‌నే గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స‌భ్యులు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం ద‌క్కించుకున్నారు. మంచి నాలెడ్జ్‌.. ఉన్న‌త విద్యావంతుడు కూడా అయిన లావుకు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది.

అయితే.. ఎంత మంచి పేరున్నా.. వైసీపీలో ఇప్పుడు ఆయ‌న‌కు టికెట్ ద‌క్కేనా? అనే సందేహాలు ముసు రుకున్నాయి. దీనికి కార‌ణం.. సొంత పార్టీలో నేత‌ల‌తో ఉన్న విభేదాలు.. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధానిని పార్టీలో ప్ర‌తి ఒక్క‌రూ విభేదిస్తుండ‌గా.. లావు మాత్రం నేరుగా అమ‌రావ‌తి రైతుల శిబిరాల వ‌ద్ద‌కు వెళ్లి వారిని ప్రోత్స‌హించార‌నే వాద‌న పార్టీలో ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను కొన్నాళ్లుగా ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు.

అయితే.. ఇప్పుడు రాజ‌కీయంగా మ‌రో వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవ‌ల లావు.. టీడీపీతో ట‌చ్‌లో కి వెళ్లార‌ని.. ఆయ‌న వ్య‌వ‌హారంపై చ‌ర్చించాల‌ని.. కొంద‌రు ఎమ్మెల్యేలు.. లావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన ఎంపీ లావు.. త‌ను ఎవ‌రికీ ట‌చ్‌లోకి వెళ్ల‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. లావు ఎన్ని చెప్పినా ఈ వ్య‌వ‌హారాన్ని పార్టీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యాన్ని పార్టీ ప‌క్క‌న పెట్టిందా? ఇస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. న‌ర‌స‌రావుపేట టికెట్‌కు వేణుగోపాల్ రెడ్డికి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఎంపీ లావుకు ఎక్క‌డ అవ‌కాశం క‌ల్పిస్తారు? అనేది మాత్రం ఎవ‌రూ చెప్ప‌డం లేదు. ఈ విష‌యంపై చాలా వ్యూహాత్మ‌క మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.