అమలాపురంలో ఈసారి పోట్లగిత్తలు బరిలో దిగుతున్నాయా

ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది. ఓవైపు వివిధ పార్టీల టికెట్ల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు పార్టీలు కూడా నియోజకవర్గాలలో తగిన అభ్యర్థులు ఎవరా అనే లెక్కలు వేసుకుంటున్నాయి. కోనసీమ జిల్లాలోని కీలక లోక్ సభ నియోజకవర్గం అమలాపురం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారా అనేది చర్చనీయమవుతోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన గంటి హరీశ్ మాథుర్ ఈసారి అమలాపురం బరిలో ఉండకపోవచ్చన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడైన హరీశ్ గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. వైఎస్ జగన్ గాలి వీస్తుండడంతో, విడిగా పోటీ చేసిన జనసేన 20 శాతం ఓట్లను చీల్చడంతో అమలాపురం లోక్ సభ బరిలో హరీశ్ ఓటమి పాలయ్యారు. సుమారు 39 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా తిరుగుతుండడంతో రానున్న ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ ఇస్తారని భావించారు.

అయితే, అమలాపురంలో గెలిచిన వైసీపీ ఎంపీ చింతా అనురాధ ఈసారి అక్కడ బరిలో ఉండకపోవచ్చని… మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరి అమలాపురంలో పోటీ చేస్తారనే అంచనాలు ఉండడంతో టీడీపీ కూడా తన వ్యూహం మార్చుకుంటోంది. యువకుడే అయినప్పటికీ సౌమ్యుడిగా పేరున్న హరీశ్ మాథుర్ అయితే హర్షకుమార్‌ను ఎదుర్కోవడం కష్టమని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.

నియోజవర్గంలో పట్టు, వాగ్దాటి, దూకుడు తత్వం ఎక్కువగా ఉన్న హర్షకుమార్‌ను ఢీకొట్టాలంటే అదే స్థాయిలో నోరు, దూకుడు ఉన్న నేతలు అవసరం. అందుకే టీడీపీ దూకుడు గల నేత కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో మోకా ఆనంద్ సాగర్ పేరు ఇప్పుడు తెరపైకి వస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మోకా ఆనంద్ సాగర్ పాలక వైసీపీని ఎదుర్కోవడంలో దూకుడుగా ఉన్నారు. దళిత వర్గాలలో మంచి పట్టున్న ఆయనైతే హర్షకుమార్‌ను ఎదుర్కోగలుగుతారని టీడీపీ అధిష్టానం భావిస్తోందట.

ఆనంద్ సాగర్ తండ్రి మోకా విష్ణు ప్రసాదరావు ఎమ్మెల్యేగా ఒకసారిగా మంత్రిగా పనిచేశారు. ఆనంద్ సాగర్ కూడా 1999లో ముమ్మిడివరం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత కొద్దిరోజలుగా ఆయన టీడీపీలో చాలా యాక్టివ్‌గా మారారు. దీంతో అధిష్టానం ఆయన్ను అమలాపురం లోక్ సభ సీటు నుంచి పోటీ చేయించాలనుకుంటున్నట్లు సమాచారం.

అదేసమయంలో బాలయోగి కుమారుడు హరీశ్ మాథుర్‌ను ముమ్మిడివరం అసెంబ్లీ నుంచి పోటీచేయించే యోచనలో ఉంది పార్టీ. హరీశ్‌ను కొద్దిరోజుల కిందట ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించడం దానికి సంకేతమే.

అయితే, హర్షకుమార్, ఆనంద్ సాగర్ ఇద్దరూ అమలాపురం బరిలో ఉంటే మాత్రం పోట్ల గిత్తలు బరిలో ఉన్నట్లుంటుందని అంటున్నారు స్థానికులు.