#AppuRatnaAPCM జగన్‌కు పవన్ శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఏమిటి? నమ్మలేకపోతున్నారా? నిజమే.. ఈ వార్త నిజమే.

జగన్‌కు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఎందుకు చెప్పారో తెలిస్తే మాత్రం అబ్బోయ్ పవన్ కూడా సెటైర్లు వేస్తున్నాడే అనుకుంటారు.

అవును… పవన్ వ్యంగ్యంగానే జగన్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ పేరు అప్పుల కారణంగా దేశమంతా పాపులర్ అవుతోందని, అందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అంతేకాదు… ఆంధ్రప్రదేశ్ అప్పులు రోజురోజుకూ పెరుగుతుంటే జగన్ వ్యక్తిగత ఆస్తులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని… అదే జగన్ స్ఫూర్తి అని ఆయన అందులో రాశారు. అప్పురత్న ఏపీ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా దీనికి జోడించారు. దీనికి ఓ కార్టూన్ కూడా జోడించారు పవన్. అందులో ఏపీ ప్రభుత్వం 9 నెలల్లో రూ. 55,555 కోట్ల అప్పు చేసినట్లు ఉంది.

కాగా పవన్ ట్వీట్ దెబ్బకు #AppuRatnaAPCM అనేది ట్విటర్‌లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌గా మారింది. పవన్ ట్వీట్‌ను రెండు గంటలలోనే సుమారు 2.5 లక్షల మంది చూడడంతో పాటు వేల మంది లైక్ చేశారు.

కాగా పవన్ ట్వీట్‌పై వైసీపీ శ్రేణులు ఎదురుదాడి చేస్తూ కామెంట్లు చేస్తుండగా జనసేన, పవన్ అభిమానులు మాత్రం సపోర్టింగ్‌కా కామెంట్లు పెడుతూ పెద్దఎత్తున రీట్వీట్ చేస్తున్నారు.

పవన్ చేసిన ఈ ట్వీట్‌పై యాక్టివిటీ భారీగా ఉండడంతో #AppuRatnaAPCM అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. కాగా జనసేనకు చెందిన మరో నేత నాదెండ్ల మనోహర్ కూడా ఏపీ అప్పుల విషయం ప్రస్తావిస్తూ జగన్ ను టార్గెట్ చేస్తూ నిన్న ట్వీట్ చేశారు. వైసీపీ సర్కారు కొత్త రికార్డు సృష్టించిందని, రోజుకు రూ. 205.759 కోట్ల చొప్పున అప్పు చేసిందని ఆయన లెక్కలు చెప్పారు.

“ఘనత వహించిన వైసీపీ సర్కార్ రోజుకి రూ.205.759 కోట్లు చొప్పున అప్పు చేసింది !!. ఈ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సం.లో మొదటి మూడు త్రైమాసికాల్లో నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172.777 కోట్లు. ఈ తొమ్మిది నెలల్లో స్థూల రుణం రూ.55,555 కోట్లు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మనోహర్ నిన్న చేసిన 9 రోజులలో రూ. 55,555 కోట్ల రుణం అనే అంశంపై జనసేన కార్టూన్‌ను షేర్ చేస్తూ తాజాగా పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్‌కు సెటైరికల్‌గా శుభాకాంక్షలు చెప్పారు.