నాందేడ్ లో బీఆర్ఎస్ స‌భ‌.. క‌లిసొచ్చేదేంటి?

దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలనే సంకల్పం, కుదిరితే కేంద్రంలో పాగా వేయాల‌నే కీల‌క ల‌క్ష్యంతో ఆవిర్భవించిన భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్).. తన తొలి రాష్ట్రేతర సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొనే సభ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాందేడ్‌లో కేసీఆర్‌ కటౌట్‌లు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి.

మహారాష్ట్ర స‌రిహ‌ద్దు, తెలంగాణ సమీప గ్రామాల నుంచిపెద్ద ఎత్తున‌ ప్రజల్ని సభకు తరలించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ సమక్షంలో పలువురు మరాఠా నాయకులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన తర్వాత రాష్ట్రం వెలుపల నిర్వహిస్తున్న తొలిసభను విజయవంతం చేసేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాందేడ్‌ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుందని కేసీఆర్‌ అన్నారు.

పలువురు మరాఠా నాయకులు.. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నాందేడ్‌ గురుద్వార్‌ మైదానంలో సభకు ఏర్పా‌ట్లు పూర్తి చేశారు. మహారాష్ట్రలోని తెలుగువారు, మైనార్టీ ప్రజలున్న ప్రాంతాల్లో, మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు జడ్పీ ఛైర్‌పర్సన్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లతోపాటు పదుల సంఖ్యలో కౌన్సిలర్లు, సర్పంచులు పార్టీలో చేరే అవ‌కాశం ఉంది.

ఇటీవ‌ల ఖ‌మ్మంలో తొలిసారి బీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ‌ను నిర్వ‌హించారు. దీని త‌ర్వాత‌.. ఏపీలో నిర్వ‌హిస్తార‌ని అనుకున్నా.. వ్యూహాత్మ‌కంగా దీనిని మ‌రాఠా వైపు మ‌ళ్లించారు. పోల‌వ‌రం వివాదం, జ‌ల జ‌గ‌డాలు.. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిస్థితి, విశాఖ ఉక్కు వంటి స‌మ‌స్య‌లు ఉన్న నేప‌థ్యంలో బీఆర్ ఎస్ అక్క‌డ స‌భ పెడితే.. వాటిని ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ రెండో స‌భ‌ను నాందేడ్‌లో ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.