మంత్రిపదవుల అప్పగింతతో జగన్ ఏం చెప్పారు?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిర్ణయాలు తీసుకోవటంలో.. ఎజెండాను అమలు చేయటంలో మంచి ముహుర్తాలంటూ ఏమీ ఉండవు. సమయానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటమే. బలంగా ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించటం ముందుచూపు ఉన్నోళ్లు చేసే పని. ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడైతే వెనక్కి తగ్గుతామో అప్పటి నుంచి రాజీ పడటం అలవాటు అవుతుంది. సామాన్యుల మొదలు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలోనూ ఇలాంటి మైండ్ సెట్ కనిపిస్తుంటుంది. ఎవరిదాకానో ఎందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విపక్ష నేత చంద్రబాబు ఇద్దరినే తీసుకోండి. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

తన చుట్టూ ఉండే కోటరీని సంతోషపెట్టేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు గాలి వాటంగా వచ్చే సంపన్నులు.. పారిశ్రామికవేత్తల్ని తన చుట్టూ ఉంచుకుంటారు. ఈ కారణంతోనే పదవుల ఎంపికలో ఆయనకు పెద్ద స్వేచ్ఛఉండదు. చాలా పరిమితులు ఉంటాయి. చేతిలో అధికారం ఉన్నా.. లేకున్నా ఇలాంటి పరిస్థితినే బాబు ఎదుర్కొంటుంటారు.
కానీ.. సీఎం జగన్ తీరు మాత్రం అందుకు భిన్నం. నిర్ణయాలు తీసుకోవటంలో తనదైన మార్కును ప్రదర్శిస్తారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగరు. అదే సమయంలో తాను తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం ఎవరిక ఇవ్వరు. దీంతో ప్రయోగాలకు అవకాశం ఉంటుంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన పిల్లి.. మోపిదేవి స్థానంలో మంత్రి పదవుల్ని అప్పజెప్పిన వైనం దీనికి నిదర్శనంగా చెప్పాలి.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవిని అప్పజెప్పటంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న వారికి షాకిస్తూ.. ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నారు. అలా అని సీదిరి అప్పలరాజుకు ఏమైనా ఛరిష్మా ఉందా? అంటే ప్రత్యేకంగా లేదనే చెప్పాలి. మరి.. అలాంటి నేతకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చినట్లు? అంటే.. అదే జగన్ ప్రత్యేకత.

సాధారణంగా రాజకీయాల్లో వినిపించే ఆశావాహులు అన్న పదం జగన్ హయాంలో ఉండదు. ఎందుకంటే అలాంటి వాటిని ఆయన ప్రోత్సహించరు. ఒకసారి అలాంటి అవకాశం ఇస్తే అంతుపొంతు లేకుండా సాగుతూనే ఉంటుంది. ఆశావాహులన్న వారిని ప్రోత్సహిస్తే.. పరోక్షంగా అసంతృప్తులకు అవకాశం ఇచ్చినట్లే. అందుకే.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న విషయాన్ని తాను మాత్రమే డిసైడ్ చేస్తానన్న సంకేతాల్ని ఆయన చెప్పకనే చెప్పేస్తారట. ఏదైనా పదవి మీద ఆశ పడుతున్న విషయాన్ని నేతలు ఎవరూ తన వద్దకు వచ్చి చెప్పే అవకాశాన్ని జగన్ ఇవ్వరని చెబుతారు.

దివంగత మహానేత వైఎస్ అందుకు భిన్నం. తన జిల్లాకు చెందిన చిన్నపాటి పోలీసు అధికారి సైతం తన దగ్గరకు వచ్చి.. ‘అన్నా.. ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలన్నా’ అంటూ గారంగా అడగటం.. అందుకు నవ్వేసి.. చూద్దాంలే.. ముందు ఉద్యోగం సంగతి చూడంటూ మాట్లాడి పంపటం వైఎస్ కు అలవాటు. తండ్రికి భిన్నంగా జగన్ అప్రోచ్ ఉందని చెబుతారు. పదవుల కోసం పాకులాడే వారి కంటే.. తన వ్యూహానికి సరిపడేలా సైన్యాన్ని సిద్ధం చేసుకోవటానికే జగన్ ప్రాధాన్యత ఇస్తుంటారు. పేరు ప్రఖ్యాతులున్న వారికి పదవులు అప్పజెబితే.. వారి నీడలో తాను నిలబడాల్సి వస్తుంటుంది. అందుకు భిన్నంగా కొత్త తరాన్ని తయారు చేస్తే.. వారంతా తనకు విధేయులుగా ఉండటం ఖాయం. కొత్త తరం నాయకత్వం.. అది కూడా తన కనుసన్నల్లో ఉండే వారిని ఎంపిక చేసుకోవటం చూస్తే.. జగన్ ఎంత స్పష్టతతో ఉన్నారో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.