జనసేన అధినేత, ఓ వైపు రాజకీయాలు మరోపైవు సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అప్పుల్లో ఉన్నారని.. ఆయనకు వచ్చే ఆదాయం కన్నా.. చేసే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని.. ఆయన సోదరుడు, జనసేన కీలక నాయకుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కౌలు రైతు భరోసా యాత్ర సహా.. వివిధ రూపాల్లో పవన్ తన పార్టీ తరఫున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.
అయితే చాలా సార్లు ఆయన ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయని అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యంగా సినీ వర్గాల్లోని వారు కూడా ఇదే చెప్పేవారు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు… పవన్ ఆర్థిక వ్యవహారాలు.. అప్పులపై సంచలన వ్యాఖ్యలుచేశారు. “కల్యాణ్ ఆస్తుల కన్నా కూడా అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే పవన్‌కు అప్పులు ఉన్నాయంటే చాలా మంది ఆశ్చర్యపోతారు“ అని అన్నారు.
పార్టీ కోసం, ప్రజల కోసం తన సంపాదన నుంచే హెల్ప్ చేస్తున్నాడని నాగబాబు చెప్పారు. జనసేన స్థాపించిన సమయంలో పిల్లల పేరిట ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీశాడంటూ వచ్చిన వార్తలు కూడా నిజమేనని అన్నారు. పవన్ ఆస్తులు మొత్తం తాకట్టులోనే ఉన్నాయని, ఆయనకంటూ ఉన్న ఆస్తులు ఏమీ లేవని వెల్లడించారు. ఒక్క ఫామ్ హౌస్ మాత్రమే ఉందన్నారు. పవన్‌కు ఉన్న ఒకే ఒక్క ఆస్తి అదేనని చెప్పారు. అది కూడా 8 ఎకరాల పొలం మాత్రమేనని అన్నారు. ఎంతో ఇష్టంతో కొనుకున్నట్టు వెల్లడించారు.
“జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తాను తీసుకున్న రూ.కోటిన్నర రెమ్యూనరేషన్ ను డిస్టిబ్యూటర్స్‌కు వెనక్కి ఇచ్చేశాడు. ఇంకా తన సేవింగ్స్ కూడా కొన్ని వాళ్లకే ఇచ్చాడు” అని నాగబాబు తెలిపారు. ఇదే సమయంలో తనకున్న 8 ఎకరాల పొలం కూడా ఇచ్చేస్తానని చెప్పాడని, కానీ, తామే అడ్డుకున్నామని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ పొలం విలువ రూ.15 లక్షల వరకు ఉందన్నారు. తనకున్న ఇల్లు, కార్లు కూడా ప్రస్తుతం లోన్‌లోనే ఉన్నాయన్నారు. ఆస్తులు కూడబెట్టాలనే మనస్థత్వం పవన్‌కు లేదని నాగబాబు పేర్కొన్నారు.