పోలీసులకు ఓ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

ఇటీవల కాలంలో ఏపీలోని పోలీసుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెనుకా ముందు లేకుండా రూల్ బుక్ వదిలేసి.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్న తీరు పలు సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

ఆదివారం అర్థరాత్రి తన భర్త.. న్యాయవాది అయిన సుభాష్ చంద్రబోస్ ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు.. ఏలేశ్వరం పోలీసులు అక్రమంగానిర్బంధంలోని తీసుకున్నారని.. ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ భార్య వెంకటప్రియ దీప్తి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు విచారణకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్ ఆస్మి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది.. పిటిషన్ దారు న్యాయవాది మధ్య సీరియస్ వాదనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఇంటికి వెళ్లిన సమయంలో చంద్రబోస్ పారిపోయారని.. ఆయన పోలీసుల అదుపులో లేరని పేర్కొన్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారని.. ఈ ఘటనపై డీజీపీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పిటిషనర్ తరఫున న్యాయవాది సతీశ్ తన వాదనలు వినిపిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

న్యాయవాది చంద్రబోస్ ను పోలీసులు అర్థరాత్రి తీసుకెళ్లారని.. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను పరిశీలించాల్సిందిగా అభ్యర్థించారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. పోలీసులే బలవంతంగా తీసుకెళ్లినట్లుగా పిటిషనర్ చెబుతుంటే.. పారిపోయినట్లుగా ఎలా చెబుతారని ఎస్పీని ప్రశ్నించింది. ఏదైనా రాజకీయ కారణంతో ఇలా చెబుతున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.

న్యాయవాది బోస్ కు ప్రాణహాని ఉందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయగా.. దీనిపై స్పందించిన కోర్టు.. కేసు కోర్టు లో పెండింగ్ ఉండగా.. ఏ పోలీసు అధికారి అలాంటి సాహసం చేస్తారని అనుకోవటం లేదని.. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే పర్యవసానం ఎలా ఉంటుందో వారికి తెలుసని వ్యాఖ్యానించింది.

‘‘తలుపులు పగలకొట్టి ఒక న్యాయవాది ఇంట్లోకి అర్థరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమైనా నేరస్థుడా? అంత అత్యుత్సాహం ఎందుకు? నేరస్థుడి ఇంట్లోకి సైతం అలా జొరబడకూడదు. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడి సంగతేమిటి? వారి హక్కుల పరిరక్షణ ఎలా ఉంటుంది?’’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.

పోలీసు అధికారులు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే.. తాము తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకుంటామని.. అధికారులకు వ్యతిరేకంగా తామిచ్చే ఉత్తర్వులతో కష్టాల్లో పడతారని పేర్కొంది. అప్పుడు ఏ రాజకీయ నేత కూడా ఆదుకోవటానికి రారంటూ హెచ్చరించింది. ఎస్పీని ఉద్దేశించి మీరు డైరెక్ట్ ఎస్పీనా? ప్రమోషన్ మీద ఎస్పీ అయ్యారా? అని ప్రశ్నించగా.. తాను డైరెక్ట్ ఎస్పీగా పేర్కొన్నారు.

‘‘నేరుగా ఎస్పీ అయిన వారు బాధ్యతగా వ్యవహరిస్తారన్న ఆశ ఉంటుంది. మీదైన తరహాలో వ్యవహరించండి. మీకు మరెంతో కెరీర్ ఉంది. ప్రజా హక్కుల్నికాపాడండి. ప్రజలకు జవాబుదారీగా ఉండండి’’ అని చెప్పింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ను కనుగొంటే హైకోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.