ఇక మొద‌లు.. యువ‌గ‌ళంపై కేసులే కేసులు!!

టీడీపీ నాయ‌కులు ఏ కార్య‌క్రమం చేస్తున్నా.. పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. కీల‌క నేత‌ల‌ను, మాజీ మంత్రుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు.. కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల అనుచ‌రుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో సింప‌తీ వ‌చ్చే ఏ కార్య‌క్ర‌మాన్ని కూడా వారు వ‌దిలి పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పైనా పోలీసులు విరుచుకుప‌డేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. కుప్పంలో నారా లోకేష్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాదయాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం ఎస్ఐ శివకుమార్‌ ఫిర్యాదు చేశార‌ని, దీంతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామ‌ని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలావుంటే, యువగళం పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా త‌ర‌లి వ‌స్తున్న కార్య‌క‌ర్త‌ల‌ను కూడా అడ్డుకునేందుకు పోలీసులు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నార‌ని.. పార్టీ నేత‌లు అనుమానిస్తున్నారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో సంఘ విద్రోహ శ‌క్తులు పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని.. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసులు వ్యాఖ్యానించ‌డం.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. సంఘ విద్రోహులు అంటే ఎవ‌రంటూ.. పోలీసుల‌ను నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఇదిలావుంటే.. తాము ఇచ్చిన అనుమ‌తుల‌ను యువ‌గ‌ళం నేత‌లు ఎవ‌రూ కూడా పాటించ‌డం లేద‌ని.. పోలీసులు వ్యాఖ్యానించారు. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను తీసుకువ‌స్తున్నార‌ని.. ఇంత మందిని అనుమ‌తించేందుకు నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని కూడా పోలీసులు హెచ్చ‌రించారు. అంటే.. దీనిని బ‌ట్టి యువ‌గ‌ళంపై పోలీసులు కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. కోర్టును ఆశ్ర‌యించాల‌ని టీడీపీ నేత‌లు నిర్ణ‌యించారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.