ఏపీ సీఎం జగన్‌ను ఆయన పార్టీ పరివారం, అనుకూల మీడియా సైతం ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. అంతేకాదు.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా పుణికి పుచ్చుకుంటున్నాయని, ఆదర్శవంతమైన రాష్ట్రం అంటూ..ఏపీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాయ ని.. పెద్ద ఎత్తున భజనచేస్తున్నవిషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ భజనకు..పొగడ్తలకు భిన్నంగా కేంద్ర మంత్రి ఒకరు స్పందించారు.
ఏపీలో అసమర్థ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రమాదకర పరిస్థితుల అంచుల్లో ఉందన్నారు. ముఖ్యమంత్రి అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయారని చెప్పారు. సుపరిపాలనను(గుడ్ గవర్నెన్స్) అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని నిప్పులు చెరిగారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదన్నారు.
రాష్ట్రంలోని గ్రామ సర్పంచులు కేంద్రానికి వచ్చి వినతిపత్రాలు ఇచ్చే పరిస్థితి కల్పించారని దేవుసిన్హ్ చెప్పారు. గ్రామీణ అభివృద్ధికి కేంద్రం 14,15 ప్రణాళిక సంఘం నిధులు ఇచ్చిందని, అయితే.. వీటిని దొడ్డి దారిలో ప్రభుత్వం వాడుకుందని చురకలు అంటించారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. “పంచాయతీలకు ఇచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు” అని తెలిపారు.
వలంటీలర్లకు ప్రభుత్వ నిధులు పంచుతున్నారని విమర్శించారు. వలంటీర్లను కేవలం ఇతర పార్టీలను అణచి వేసేందుకు వాడుతున్నారనే సందేహం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్న కేంద్ర మంత్రి… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదన్నారు. 20 లక్షల గృహాలను కేంద్రం ఏపీకి మంజూరు చేసిందన్నారు. ఇక్కడ చూస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.