జగన్ అధికారానికి రాగానే సీఐడీ ఏడీజీగా సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జగన్ చెప్పిందల్లా చేశారు. అత్యుత్సాహంతో ఆయన చెప్పని పనులు కూడా కొన్ని చేశారు. ఆయన తీరు రోజువారీగా వివాదాస్పదమవుతూనే ఉంది. సోషల్ మీడియా కేసులు, టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం , కోర్టు వరకూ వెళ్లడం వంటి అంశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలోనే సునీల్ కుమార్‌పై ప్రతిపక్షాలు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. అంతలోనే సునీల్ కుమార్‌కు జనవరి 1వ తేదీన డీజీగా పదోన్నతి లభించింది. ఆయన వెంటనే వెళ్లి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అయితే, సోమవారం సునీల్ కుమార్‌పై బదిలీ వేటు వేస్తూ జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ జీఓ జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగింది
డీజీపీ హోదా పొందిన సునీల్ కుమార్ తీరుపై ఇప్పుడు జగన్ కోపంగా ఉన్నారని తాడేపల్లి వర్గాల టాక్. ఆయన తరచూ అమెరికా ఎందుకు వెళ్లివస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తానని కూడా సునీల్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సిన పనులను బహిరంగంగా నిర్వహిస్తూ సునీల్ అవసరానికి మించిన స్వేచ్ఛ తీసుకుంటున్నారని జగన్ ఆగ్రహం చెందినట్లు వార్తలు వస్తున్నారు. దానితో గత వారం సునీల్ అప్పాయింట్‌మెంట్ కోరగా జగన్ అందుకు నిరాకరించినట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో జగన్ చెప్పిన ఒకటి రెండు పనులు చేయడానికి కూడా సునీల్ వెనుకాడారట
డీజీపీ ఇస్తారంటూ ప్రచారం
సునీల్ కుమార్ మాత్రం తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. మూడు సంవత్సరాల పాటు సీఐడీని నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు, డీజీపీ హోదాతో పదోన్నతి కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. పైగా తనకు త్వరలో డీజీపీ పదవి వస్తుందని, అందుకే జనరల్ అడ్మినిస్టేషన్ డిపార్టమెంట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారని సహచరుల దగ్గర చెప్పుకుంటున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయనకు రెగ్యులర్ డీజీగా బాధ్యతలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా చేరలేదు. ఇదే సమయంలో సునీల్ కుమార్ కంటే సీనియర్ గా ఉన్న ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కూడా డీజీపీ పదవిని కోరుకుంటున్నారని చెబుతున్నారు. వారందరినీ కాదని జగన్ తనను సన్మానిస్తారన్నది సునీల్ వాదన. అధికార వర్గాల్లో మాత్రం అలాంటి చర్చ జరగడం లేదు..