వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఆసక్తికర అప్‌డేట్‌తో వార్తల్లోకి ఎక్కారు. గత కొద్దిరోజులుగా వైసీపీ అంతర్గత రాజకీయాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన్ను దూరం పెడుతున్నారనే ప్రచారంతో మీడియా దృష్టిని ఆకర్షించిన విజయసాయిరెడ్డి తాజాగా కరోనా పాజిటివ్ అనే ప్రచారంతో మళ్లీ వార్తల్లో నిలిచారు.
విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. దివంగత సీఎం వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారని పేర్కొంటూ అదే కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కరోనా సోకిందని ఆయా వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనికి విజయసాయిరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
కరోనా పాజిటివ్ వార్తల నేపథ్యంలో విజయసాయిరెడ్డి పరోక్షంగా తన స్పందన తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో స్వతహాగా నేనే నిర్ణయం తీసుకొని వారం నుంచి పదిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కేవలం అత్యవసరమైన సందర్భంలో మాత్రమే టెలిఫోన్‌లో అందుబాటులో ఉంటాను
అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, తనకు కరోన అంటూ జరుగుతున్న ప్రచారాన్ని విజయసాయిరెడ్డి తిప్పికొట్టలేదు. అలా అని అంగీకరించలేదు.
ఇదిలాఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 4944 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం నమోదైన కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇందులో 32,336 కేసులు యాక్టివ్ కాగా 25,574 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో 62 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య758కి చేరింది.