ఐడియాలు కావ‌లెను.. వైసీపీలో వేలాడుతున్న బోర్డులు..!

అవును..! ఇప్పుడు వైసీపీకి ఐడియాలు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించే నాయ‌కులు కావాలి. ప్ర‌స్తుతం ఉన్న ఐప్యాక్‌పై సీఎం జ‌గ‌న్ గుస్సాగానున్నార‌ని తెలుస్తోంది. విప‌క్షాల దూకుడును క‌ట్ట‌డి చేసేలా ఐప్యాక్ టీం.. దూసుకుపోయేలా వ్యూహాలు ర‌చించ‌లేక‌పోతోంద‌న్న‌ది వైసీపీ అధినేత మ‌నోగతంగా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న వ్యూహాలు పాత‌చింత‌కాయి మాదిరిగా ఉన్నార‌ని అంటున్నార‌ట‌.

వీటివ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో కొత్త ఐడియాల‌కు ఆహ్వానం ప‌లు కుతున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ప్ర‌స్తుతం ఉన్న వ్యూహాల‌కు మ‌రింత మ‌సాలా క‌ల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యించేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యంపై గ‌త రెండు రోజులుగా సీఎం జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఈ క్ర‌మంలో కొత్త‌గా పార్టీని ముందుకు న‌డిపించేలా.. ప్ర‌జ‌ల్లో మ‌రింత విశ్వాసం పెంచుకునేలా ఐడియాలు ఇవ్వాలంటూ.. ఆయ‌న జిల్లా ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల తూర్పు, అనంత‌పురం, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల‌కు చెందిన ఇంచార్జ్‌ల‌ను క‌లుసుకు నేందుకు నాయ‌కులు వెళ్ల‌గా.. ఈ సంద‌ర్భంగా వారు.. నాయ‌కుల‌కు ఇదే చెప్పార‌ని స‌మాచారం.

“ఇదిగో.. మ‌నం ఒక సంక్లిష్ట ప‌రిస్థితిలో ఉన్నాం. కోడి పందేల‌కు అనుమ‌తుల కోసం.. వెంప‌ర్లాడుతున్నారు. జ‌గ‌న్ సార్‌.. అస‌లు పందేల‌పై దృష్టి పెట్టారు. మీ ద‌గ్గ‌ర మంచి కోళ్లు ఉంటే (ఐడియాలు) చెప్పండి. వాటిని ఎలా అమ‌లు చేయాలో.. ఎలా రంగంలోకి దింపాలో సీఎం సార్ చూసుకుంటారు” అని తూర్పు గోదావ‌రికి చెందిన ఒక మంత్రి చ‌మ‌త్క‌రించార‌ట‌. ఇదే విష‌యంపై ఇత‌ర మంత్రులు కూడా.. వ్యాఖ్యానించార‌ని తెలుస్తోంది. మొత్తంగా .. ఇప్పుడు ఐడియాలు ఇచ్చేవారి కోసం వైసీపీ గేట్లు తెరిచి ఉంచింద‌ని అంటున్నారు.