ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ఈ నెల 27న యువగళం పేరుతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని 4 వందల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఈ యువగళం పాదయాత్రకు సంబంధించి అనుమతి ఇచ్చే విషయంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ముసుగులో గుద్దులాటకు దిగింది.
అనుమతి విషయంలో ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పకుండా వేధిస్తోందని టీడీపీ నాయకులు అంటు న్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అనుమతులు కోరుతూ.. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. రూట్ మ్యాప్‌ను కూడా అందించారు. ఏయే జిల్లాలు, ఎన్నేసి రోజులు అనే విషయంపై ఆయన వివరించారు. అయితే.. ఎట్టకేలకు స్పందించిన డీజీపీ.. పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటున్నారు? ఏయే వాహనాలు పెడుతున్నారు.. అంటూ.. మరిన్ని వివరాలు కోరారు.
అయితే.. పాదయాత్ర అనేది అప్పటి వరకు ఉండే పరిస్థితిని బట్టి ప్రజలు పాల్గొంటారు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి వివరాలు కోరకుండా అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం డీజీపీ ద్వారా సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పటి సమయంలో వైసీపీ సర్కారు అప్పటి డీజీపీకి రాసిన లేఖను టీడీపీనేతలు మీడియాకు వెల్లడించారు.
అప్పటి పాదయాత్రకు సంబంధించి పార్టీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి.. ఆశ్చర్యకరంగా వ్యాఖ్య లు చేశారు. పాదయాత్ర చేస్తున్నాం.. అనుమతికోరాం.. అంతే.. వివరాలు డీజీపీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు తాజాగా సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా పాదయాత్రపై అప్పట్లో చేసిన వ్యాఖ్యల తాలూకు బైట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రజాస్వామ్యంలోపాదయాత్ర చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. ప్రభుత్వాలు వాటికి అడ్డు చెప్పరా దని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రతిపక్షాలను గౌరవించాలని కూడా ఆమె అన్నారు. పాదయాత్ర లకు అనుమతించాలని.. ప్రతిపక్షాలను గౌరవించాలని.. అప్పుడే మంచి ప్రభుత్వం అనిపించుకుంటుం దని ఆమె అన్నారు. ఇది.. జగన్ సర్కారుకు చెంప పెట్టుగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు యువగళానికి అడ్డంకులు పెడుతున్న జగన్.. తన మాతృమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలని టీడీపీ అభిమానులు, నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.