రేపల్లెలో రెడీ అవుతున్న మోపిదేవి కుమారుడు

నాయకులంతా తమ వారసులను రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా అదే రూట్లో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దించడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, జగన్ తాను సీఎం కావడంతో మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు.

కానీ, శాసనమండలిలో టీడీపీ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడానికి గాను ఏకంగా శాసనమండలినే రద్దుచేయాలనే నిర్ణయానికి వచ్చిన జగన్ ఆ సమయంలో మోపిదేవి, పిల్లి సుభాస్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపించారు. అలా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మోపిదేవి ఈ మూడేళ్లలో అనేక పాత్రలు పోషించాల్సి వచ్చింది.

2020 జూన్‌లో రాజ్యసభకు వెళ్లిన మోపిదేవికి 2026 వరకు పదవీకాలం ఉంది. దీంతో 2024లో ఆయన మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే రెండేళ్ల పదవీకాలాన్ని వదులుకుని పోటీ చేయాలి. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు రాజీవ్‌ను బరిలో దించాలని మోపిదేవి యోచిస్తున్నారట. అయితే.. జగన్ నుంచి ఇంకా క్లియరెన్స్ తెచ్చుకోకపోవడంతో రాజీవ్‌ను ఇంకా రంగంలోకి దించలేదని ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ దగ్గర మంచి పేరు ఉన్న మోపిదేవికి తెలియకుండా రేపల్లె టికెట్ విషయంలో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

అయితే.. మోపిదేవినే పోటీ చేయమని జగన్ ఒత్తిడి చేసే అవకాశం ఉందనేది ఆయన వర్గీయుల మాట. అందుకే.. జగన్ వద్ద ఓకే చేయించుకుని తన కుమారుడిని రేపల్లె నియోజకవర్గానికి పరిచయం చేయాలని మోపిదేవి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే గత రెండు పర్యాయాలుగా రేపల్లెలో మోపిదేవికి ఓటమి ఎదురవుతోంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన నాయకుడిగా ప్రజలు ఆదరించలేదు అనుకున్నా 2019లో జగన్ గాలి జోరుగా వీచినప్పుడు కూడా మోపిదేవి రేపల్లెలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు కుమారుడిని అక్కడే బరిలో దించడం శ్రేయస్కరమేనా అని కూడా మోపిదేవి ఆలోచిస్తున్నారని టాక్.