బండి సంజయ్‌కు ఫుల్ మార్క్స్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనూహ్యమైన ఆదరణ దక్కింది. ప్రధాని మోదీ స్వయంగా ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.

సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ తెలంగాణలో పార్టీ పనితీరును వివరించడమే కాకుండా తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి నివేదిక సమర్పించారు. దాంతో ప్రజాసంగ్రామ యాత్ర గురించి అందరికీ వివరించాలని మోదీ సూచించడంతో బండి తన యాత్ర గురించి చెప్పడం ప్రారంభించారు. తొలుత హిందీలో మాట్లాడిన ఆయన కొద్దిసేపటికే ఆపేసి తనయాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడినదని… హిందీలో తాను చెప్పేటప్పుడు ఆ భావోద్వేగాలను వ్యక్తీకరించలేకపోతున్నానని అన్నారు. దాంతో మోదీ స్పందించి.. హిందీలో వద్దు మీ మాతృభాష తెలుగులోనే చెప్పండని సూచించారు. దాంతో బండి సంజయ్ తన యాత్ర వివరాలన్నీ తెలుగులోనే చెప్తుండగా బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ దాన్ని హిందీలోకి అనువదించారు.

మొత్తం సావధానంగా విన్న మోదీ ఇతర రాష్ట్రాల నేతలంతా బండి చేపట్టిన యాత్ర ప్రాంతాలలో తిరిగి అధ్యయనం చేయాలని.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల యువమోర్చా నేతలను ఆ ప్రాంతాలకు పంపితే అది వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఇతర రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు సూచించారు. బండి సంజయ్‌ను భుజం తట్టి అభినందించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తన ప్రసంగంలో బండి పాదయాత్రను ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.

మోదీ, నడ్డాలు బండిని ప్రత్యేకంగా ప్రశంసించడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ బండి సంజయ్‌పై పడింది. జాతీయ రాజకీయాలంటూ తొడ గొడుతున్న కేసీఆర్‌ను వెంటపడి తరుముతున్న నేతగా బండి సంజయ్‌ను ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రశంసించడం కనిపించింది.

కాగా తాజా పరిణామాలతో బండి సంజయ్‌ను మారుస్తారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడుతూ ఆయన్నే ఎన్నికల వరకు కొనసాగిస్తారన్న ప్రచారం మొదలైంది.