పవన్ కల్యాణ్ యాత్రకు సిద్ధమవుతున్నాయి. ర్యాలీలు, వీధి చివరి మీటింగులకు అడ్డుచెబుతూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో పవన్‌లో జోష్ పెరిగింది. ఇక రయ్ రయ్ అని దూసుకుపోవడమే తరువాయి అని చెబుతున్నారు…
ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్‌లోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని జనసేన నిర్ణయించింది. 2009లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన పవన్ కల్యాణ్‌కు ప్రమాదం జరిగింది. అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి అయ్యాడు. అయితే.. కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు.
రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి నుంచి ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. పూజా కార్యక్రమం తర్వాత తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.
ఎన్నికల కోసం ఊరూరా తిరిగేందుకు ప్రచార వాహనానికి వారాహి పేరు పెట్టారు. తొలి పూజ తర్వాతే పవన్ టూర్ షెడ్యూల్ ప్రకటిస్తారు. షెడ్యూల్ ఖరారు కానందునే జనవరి 2న జరగాల్సిన కొండగట్టు పూజా కార్యక్రమం 24కు వాయిదా పడిందని చెబుతున్నారు. ఇక జనవరి 24 నుంచి యుద్ధమేనని జనసేన వర్గాలు అంటున్నాయి