పొలిటిక‌ల్‌ త్రిశంకుస్వ‌ర్గంలో కాపులు…!

ఏపీలో ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఎన్ని తిట్టుకున్నా.. రాజ‌కీయాలు కులం రంగును పులిమేసుకున్నాయి. దీనికి ఏ కుల‌మూ అతీతంకాదు. రెడ్లు అంటే.. వైసీపీ, క‌మ్మ‌లు అంటే.. టీడీపీ అన్న పేరు ఉండ‌నే ఉంది. ఇక‌, ఇత‌ర కులాల్లోనూ.. మెజారిటీ సామాజిక వ‌ర్గాలు.. వైసీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని ఆ పార్టీ, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని.. ఈ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఇక‌, ఎటొచ్చీ.. ఏపీలో 15 శాతంగా(తాజాగా లెక్క‌ల ప్ర‌కారం) ఉన్న కాపులు ఎటు? అనేది మాత్రం తేల‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. కాపులు ఎన్నిక‌ల స‌మ‌యానికి యూట ర్న్ తీసుకున్న సంద‌ర్భాలు ఉన్నా యి. 2014లో టీడీపీకి అనుకూలంగా ఓటేత్తారు. ఇక‌, 2019లో మాత్రం.. వైసీపీకి అనుకూలంగా మారారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన‌వైపు చూడాల‌ని.. జ‌న‌సేన‌ను అధికారంలోకి తేవాల‌ని.. మెజారిటీ కాపు నాయ‌కులు భావిస్తున్నారు.

ఇది సాధ్య‌మే.. అని అనుకుంటున్న స‌మ‌యంలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ వేస్తున్న అడుగులే వారిని త‌ర్జన భ‌ర్జ‌న‌కు గురి చేస్తున్నాయి. కొంత సేపు.. ఒంట‌రి పోరు.. అని మ‌రికొంత సేపు.. ప్ర‌జ‌లు నావెంట నిల‌వ డం లేదు.. అందుకే.. పొత్తుల‌కు వెళ్తాన‌ని.. వీర‌మ‌ర‌ణం కోరుకోవ‌డం లేద‌ని చెప్పుకొస్తున్నారు. ఇంకొంత సేపు.. ఎవ‌రి ప‌ల్ల‌కీని తాను మోయ‌బోన‌ని అంటున్నారు. సో.. ఇవ‌న్నీ కూడా కాపులను డోలాయ‌మానంలో ప‌డేస్తున్నాయి.

వారు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. పోనీ.. జ‌న‌సేన కాదు.. వైసీపీని న‌మ్ముదామంటే.. ఇప్ప‌టికే.. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ లేకుండా చేశార‌ని.. వారికి క‌నీసం కార్పొరేష‌న్ నిధులు కూడా ఇవ్వ‌డం లేద‌ని.. గుస్సాగా ఉన్నారు. అలాకాదు.. టీడీపీతో వెళ్దామా? అంటే.. సీనియ‌ర్ నాయ‌కుల‌కు గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాలు వారిని పీడిస్తున్నాయి. వెర‌సి.. ఎటూ తేల్చుకోలేక‌.. ప‌వ‌న్ అడుగులు గుర్తించ‌లేక‌.. కాపు నాయ‌కులు త్రిశంకు స్వ‌ర్గంలో అల్లాడిపోతున్నారు. మ‌రి ఈ ఊగిస‌లాట‌లు ఎన్నాళ్లు కొన‌సాగుతాయో చూడాలి.