కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ?

జనసేన, టీడీపీ పొత్తు ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఆ పార్టీ నేతలతో పాటు పాలక వైసీపీలోనూ ఆసక్తి పెంచుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా జనసేన వర్గాల నుంచి మరో లీక్ వచ్చింది. ఇంతవరకు పవన్ గతంలో పోటీ చేసిన సీట్లలో కానీ, పిఠాపురంలో కానీ పోటీ చేస్తారన్న అంచనాలు ఉండగా ఇప్పుడు సీను కాకినాడ రూరల్‌కు మారింది. పవన్ కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది.

కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా పడుతుందని… ఆ జిల్లాలో జనసేన పోటీ చేసే మిగతా నియోజకవర్గాలలోనూ గెలుపు సునాయాసమవుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కాపుల కోటగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ తొలి కేబినెట్లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన కన్నబాబు 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. 2019లో ఇక్కడ జనసేన అభ్యర్థి పంతం నానాజీ మూడో స్థానంలో నిలిచినప్పటికీ 40 వేల ఓట్లు సాధించారు.

గత ఎన్నికలలో ఓటమి తరువాత టీడీపీ ఇక్కడ కొంత బలహీనపడింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన పిల్లి అనంతలక్ష్మి మరోసారి టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం గెలుపుపై పెద్దగా నమ్మకం లేదు. దీంతో పవన్ కల్యాణ్‌కు ఈసీటు ఇచ్చి తాము మద్దతిస్తే భారీ మెజారిటీతో ఆయన గెలిచే అవకాశముందని టీడీపీ కూడా భావిస్తోంది.

సుమారు లక్షా 80 వేల ఓట్లున్న కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాపుల ఓట్లు సుమారు లక్ష వరకు ఉంటాయని అంచనా. పవన్ ఇక్కడ నుంచి పోటీచేస్తే పార్టీలకు అతీతంగా కాపు ఓట్లన్నీ గరిష్ఠంగా ఆయనకే పడే అవకాశాలుంటాయి.

అయితే.. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే , వైసీపీ నేత కురసాల కన్నబాబు ఇరకాటంలో పడినట్లే అవుతుంది. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన ఈ జర్నలిస్ట్ వైసీపీలో ఉన్నా, జగన్ కేబినెట్లో పనిచేసినా కూడా చిరంజీవికి ఇప్పటికీ భక్తుడే. అదేసమయంలో వైసీపీ అధినేత జగన్‌కు కూడా వీరవిధేయుడు. అలాంటిది ఇప్పుడు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీచేస్తే కన్నబాబు ఆయనపై పోటీ చేస్తారా.. వేరే నియోజకవర్గం కావాలని జగన్‌ను అడుగుతారా… ఒకవేళ జగన్ మాటకు కట్టుబడి పవన్‌పై కన్నబాబు పోటీచేసినా గట్టి పోటీ ఇస్తారా అనేది చూడాలి. మొత్తానికి పవన్ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయడమేమో కానీ కన్నబాబును ఇరకాటంలో పెట్టేసినట్లయింది.