వసంత వెళ్లకు.. వెళ్లకు, వెళ్లకు..వసంత… వైసీపీలో వినిపిస్తున్న కొత్త రాగం ఇది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్కడ జారిపోతాడోనన్న భయం వైసీపీ వర్గాల్లో నెలకొంది. పక్క చూపులు చూస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన అలిగిన కొద్దీ బుజ్జగించేందుకు అధికార పార్టీ అధిష్టానం నానా పాట్లు పడుతోంది. తాజాగా వసంత కామెంట్స్ రుచించకపోయినా అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది.
మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేస్తూ వసంత కొన్ని వ్యాఖ్యలు చేశారు. పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరగడం చేతగాక పాతతరం నాయకుడిలా మిగిలిపోయానని అన్నారు. రౌడీలను వెంటేసుకుని వారిలా తిరిగితేనే రాజకీయాల్లో ముందుకెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయని వసంత విశ్లేషించారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా, ఎమ్మెల్యే ఎందుకు అయ్యానా అని బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేకపోతున్నానని వాపోయారు.
వసంతకు అనుకూలంగా సర్వేలు
ఎన్టీయార్ జిల్లాలో వైసీపీ నిర్వహించిన సర్వేలో వసంత కృష్ణప్రసాద్ కు మంచి మార్కులే వచ్చాయి. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏ పనైనా చేసి పెట్టేందుకు వెనుకాడరని సర్వేలో వెల్లడైంది. జిల్లాలో ఖచితమైన విజయావకాశాలున్న నియోజకవర్గాల్లో ఆయన ప్రాతినిధ్యం వహించే మైలవరం మాత్రమే ఉందని తేలింది.
దానితో ఆయనను బుజ్జగించేందుకు అయోధ్య రామిరెడ్డి లాంటి నేతలను పంపారు. అంతలోనే వసంత కృష్ణప్రసాద్ కేశినేని నానితో భేటీ కావడం కొంత సంచలనం కలిగించింది. ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారన్న చర్చ మొదలైంది. అందుకు వసంత గట్టి కౌంటరే ఇచ్చారు. రాజకీయాలు మానుకుంటానే తప్ప వైసీపీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని వసంత తేల్చారు…
మామూళ్లు వసూలు చేయలేకే…
వసంత ఫ్రస్టేషన్ వెనుక ఉన్న కారణాలపై సీరియస్ విశ్లేషణలు జరుగుతున్నాయి. అందులో ఒకటి మామూళ్ల వ్యవహారం. వసంతకు అధిష్టానం పెట్టిన టార్గెట్ చేరుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక రీచ్ ల వ్యవహారంలో అనుకున్నంత డబ్బులు రావడం లేదట. దానితో వసంత సొంత డబ్బులు వేసుకుని అధిష్టానానికి పంపిస్తున్నారు. ఆ ఆర్థిక నష్టం భరించలేకపోవడం ఒక వంతయితే, ప్రత్యర్థి జోగి రమేష్ ఓవరాక్షన్ భరించలేకపోవడం మరో వంతు. ఈ రెండు సమస్యలను అధిష్టానం పరిష్కరించిన పక్షంలో వసంతకు ఏ ప్రాబ్లం ఉండదని అంటున్నారు…