బీఆర్ఎస్‌తో జట్టు కట్టడానికి చంద్రబాబు, పవన్ ఎందుకు రెడీ ?

పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీ ఏపీలోని పాలకపార్టీ వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పైన, ఏపీలో ఈ రెండు పార్టీల పొత్తులపైన, వైసీపీని ఎదుర్కొనే వ్యూహాలపైన వీరిద్దరు ఎంత చర్చించుకున్నా పెద్దగా పట్టించుకోని వైసీపీ… వారిద్దరి చర్చ తరువాత వెల్లడించిన ఓ అంశంపై మాత్రం కంగారుపడుతోందట. అది బీఆర్ఎస్ విషయంలో చంద్రబాబు, పవన్‌ల స్టాండ్. అవును… బీఆర్ఎస్ ఏపీలోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఇద్దరు నేతలు చెప్పడంతో వైసీపీ శిబిరంలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. అసలు చంద్రబాబు, పవన్‌ల ప్లానేంటి.. బీఆర్ఎస్ ఏపీలోకి ఎందుకు వస్తోంది… వీరిద్దరితో కేసీఆర్ కలిస్తే పరిస్థితి ఏంటనేది వైసీపీకి అంతుచిక్కడం లేదు.

కాగా పవన్ కల్యాణ్, చంద్రబాబులు కలిసి ఈ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ విషయంలో సానుకూలంగా స్పందించారు. రాజకీయాలలో పొత్తులు సహజమేనని… 2009లో కేసీఆర్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తరువాత ఎన్నికల్లో కేసీఆర్‌తో విభేదించిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. రాజకీయాలలో పొత్తులు సహజమని.. పరిస్థితులును బట్టి పొత్తులు ఉంటాయన్న సంకేతాలిచ్చారు పవన్, చంద్రబాబులు.

2004లో కాంగ్రెస్ పార్టీ 185 సీట్లతో అధికారంలోకి రాగా వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. 2009లో మళ్లీ ఆయనే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లగా టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌లు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలలో 294 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 225 సీట్లకు టీడీపీ పోటీ చేయగా టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలో 45 సీట్లలో పోటీ పడింది. ఈ ఎన్నికలు టీడీపీకి బాగా లాభించాయి. అధికారంలోకి రాలేకపోయినప్పటికీ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బలాన్ని భారీగా తగ్గించగలిగింది టీడీపీ. 2004లో 185 సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం 2009లో 156కి పడిపోగా… 2004లో 47 సీట్లే గెలిచిన టీడీపీ 2009లో తన బలాన్ని 92 సీట్లకు పెంచుకోగలిగింది. అయితే… టీఆర్ఎస్ మాత్రం 2004తో పోల్చితే బాగా నష్టపోయింది. 2004లో 26 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ 2009లో 10 సీట్లకే పరిమితమైంది.

ఈ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయడంతో టీడీపీ బాగా నష్టపోయింది. ప్రజారాజ్యం 18 సీట్లే గెలిచినప్పటికీ అనేక చోట్ల టీడీపీ విజయావకాశాలను దెబ్బతీసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడానికి కారణమైంది.

ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకమవుతున్న టీడీపీ, జనసేనలు అవసరమైతే బీఆర్ఎస్‌ను కూడా కలుపుకుంటామని చెప్పడానికి అదే కారణం… 2009లో ప్రజారాజ్యం కారణంగా అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు కూడా విపక్షాలు దేనికవి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందన్నది చంద్రబాబు, పవన్‌ల ఆలోచన. మరి.. బీఆర్ఎస్ వీరికి సహకరిస్తుందో లేదో చూడాలి.