ఎవరిది రౌడీయిజం? ఎవరిది అరాచకం?

కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదల.. అది సాధ్యమయ్యే సూచనలు లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా కుప్పంలో చంద్రబాబు పర్యటననూ అడ్డుకున్నారంటున్నారు టీడీపీ నేతలు.

కుప్పంలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయగా… వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

కుప్పంలో చంద్రబాబు రౌడీయిజం చేశారని, పోలీసులపైకి తన కార్యకర్తలను ఉసిగొల్పారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలీస్‌ యాక్ట్‌ 30 అమలులో ఉన్న చోట అనుమతి లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను చంద్రబాబు తిరస్కరించారని.. ఆయనకు చట్టాలపై గౌరవం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఇరుకు రోడ్లపై సభలతో 11 మంది ప్రాణాలు బలిగొన్నారని.. గతంలో పుష్కరాల సమయంలో 29 మందిని బలితీసుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

కుప్పంలోనూ చంద్రబాబు ప్రతిష్ట దిగజారిపోవడంతో.. పోయిన ప్రతిష్ఠ తిరిగి సంపాదించుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. అందుకోసం చంద్రబాబు రౌడీయిజాన్ని నమ్ముకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

‘పోలీసుల అనుమతితో నిర్వహించుకునే సభకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ రౌడీలా వ్యవహరిస్తే కుప్పంలో తిరిగి ప్రాచుర్యం పొందవచ్చన్న చంద్రబాబు దిగజారుడు తీరు చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. రాజకీయ విలువను దిగజార్చేలా చంద్రబాబు వ్యవహరించారు. గతంలో కూడా ఇదే కుప్పంలో ఆయన తన అనుయాయులను రెచ్చగొట్టి కర్రలు, హాకీస్టిక్స్, రాళ్ళతో వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు. అవి ఆయనకు అలవాటుగా మారాయి. అందుకే ఇవాళ కూడా అదే విధంగా పోలీసులపైనే దాడికి ఉసిగొల్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయకుడి రూపంలో ఉన్న రాక్షసుడిగా మారాడు’ అంటూ పెద్దిరెడ్డి ఆరోపించారు.

మరోవైపు చంద్రబాబు కూడా వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చారు. కుప్పంలో బుధవారం జరిగింది ప్రపంచంలోని తెలుగువారంతా చూశారన్న ఆయన గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిల, విజయమ్మ, జగన్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్రలు చేసుకున్న విషయం గుర్తుచేశారు.

వైఎస్ కుటుంబానికి చెందిన నలుగురూ తాను సీఎంగా ఉన్నప్పుడే పాదయాత్రలు చేశారని.. వారిలో ఏ ఒక్కరికీ ఆటంకాలు కలిగించలేదని.. అలాంటిది ఇప్పుడు తాను సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత వారిని కలుసుకునేందుకు వీలు లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఎస్పీ శాంతి భద్రత లను కాపాడటానికి ఉన్నారా, టిడిపి కార్యకర్తలపై దాడులు చేయించేందుకు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తనను ప్రజలలో తిరగకుండా చేయాలన్నదే వైసీపీ లక్ష్యమని చంద్రబాబు ఆరోపించారు.

కాగా ముందుముందు లోకేశ్, పవన్ యాత్రలు ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ విధిస్తున్న ఆంక్షలు, బుధవారం కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న పోలీసుల తీరును ఏపీలోని మిగతా రాజకీయపార్టీల నేతలూ తప్పు పడుతున్నారు. వామపక్షాలు, బీజేపీ, జనసేన నేతలు పోలీసుల, ప్రభుత్వం తీరును తప్పుపట్టారు.