జగన్మోహన్ రెడ్డి శీతకన్నేసిన రావి రామనాథం బాబుకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. పార్టీలో తన పరిస్థితేమిటో అర్థం కాక ఆయన నానా తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలన్న తన కోరిక తీరే అవకాశం కనిపించడం లేదని రామనాథం బాబు ఆవేదన చెందుతున్నారు.
విత్తనాల వ్యాపారం చేసే రావి రామనాథం బాబు 2018లో వైసీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఉద్దేశంలో అక్కడ పనులు చేసుకుంటూ పోయారు. సరిగ్గా ఎన్నికల సమయంలో రామనాథం బాబుకు జగన్ షాకిచ్చారు. ఆ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి పర్చూరు వైసీపీ టిక్కెట్ కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన రామనాథంబాబు టీడీపీలో చేరారు. అక్కడా ఉండలేకపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గుబాటి .. క్రియాశీల రాజకీయాలకు దూరం జరగడంతో రామనాథ బాబు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. తిరిగి వైసీపీలో చేరిన ఆయనకు పర్చూరు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెండేళ్లుగా పర్చూరు ఇంఛార్జ్‌గా పనిచేస్తూ.. గడప గడపకు కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. జగన్ పాలన సుదీర్ఘకాలం సాగాలంటూ పర్చూరు నుండి తిరుమల వరకు రామనాథంబాబు పాదయాత్ర కూడా చేశారు. గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో రామనాథంబాబు ముందున్నాడంటూ పలు మార్లు జగన్ నుండి ప్రశంసలు కూడా అందుకున్నారు.
అంతా హ్యాపీగా జరుగుతోందనుకున్న తరుణంలోనే రామనాథం బాబుకు జగన్ మరోసారి ఝలక్ ఇచ్చారు. రామనాథంబాబును పర్చూరు ఇంఛార్జ్ పదవి నుండి తప్పించి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. చీరాలలో టీడీపీ నుండి గెలుపొందిన కరణం బలరామ్ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో చీరాల బాధ్యతలు కరణం బలరామ్‌కు అప్పగించారు. ఆమంచి రాకతో రామనాథం బాబు పరిస్థితి ఆగమ్యగోచరమైంది.
వైసీపీలో చేరిన రామనాథం బాబు 2024 తనకు పర్చూరు టికెట్ వస్తుందని ఆశించారు. ఇప్పుడు సీన్ మారింది. ఆమంచికి ఆ టికెట్ ఇవ్వబోతున్నట్లు జగన్ పరోక్షంగా ప్రకటించినట్లయ్యింది. మరి రామనాథం బాబు తదుపరి చర్యలేమిటో చూడాలి. వైసీపీలో ఉంటూ జగన్ కనికరం కోసం వేచి చూస్తారా.. లేక వేరే దారి వెదుక్కుంటారో చూడాలి..
Gulte Telugu Telugu Political and Movie News Updates