చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే ఆయన అక్కడకు చేరుకున్నారు. అయితే.. ఈ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలను నిలిపివేశారు. దీంతో శాంతిపురం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఎస్.గొల్లపల్లి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కనీస హెచ్చరికలు లేకుండానే ఉన్నపళంగా లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో పది మందికిపైగా టీడీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు మహిళా కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. ఈ పరిణామాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మండిపడ్డారు.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరులో చంద్రబాబు ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ సభలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించ పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకువచ్చారు.
అయితే, ఈ సభకు, చంద్రబాబు పర్యటనకు కూడా అనుమతి లేదని చెప్పిన పోలీసులు అన్ని మార్గాల్లో నూ పెద్ద ఎత్తున మోహరించారు. అయితే కొన్నిచోట్ల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నిలువరిస్తున్నారు.
ఇదిలావుంటే, చంద్రబాబు సభకు తాము అనుమతి కోరామని, ఈ క్రమంలో మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో వందలాది మంది పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు. చంద్రబాబు పర్యటనకు జనం రాకుండా చేసేందుకు పోలీసులు భయాందోళన కలిగించేలా ప్రవర్తిస్తున్నారని నాయకులు ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates